సీతారారాముల వారి పట్టాభిషేకంలో పాల్గొనేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిశైకు ప్రోటోకాల్ లభించలేదు. అధికారులెవరూ ఆమెకు స్వాగతం చెప్పడానికి రాలేదు. ప్రభుత్వం హెలికాఫ్టర్ కూడా కేటాయించకపోవడంతో ఆమె రైల్లో భద్రాచలం వెళ్లారు. గవర్నర్ ఏదైనా జిల్లాలో పర్యటిస్తే ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ ప్రొటోకాల్ పాటించాల్సి ఉంది. భద్రాచలం ఉన్నతాధికారులిద్దరూ రాలేదు. వారు సెలవులో ఉన్నారని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రొటోకాల్ పాటించాల్సిన ఈ ఇద్దరు అధికారులు గవర్నర్ పర్యటనలో లేకపోవడంతో ఇప్పుడు ఈ విషయం కాస్తా చర్చానీయాంశంగా మారింది. అయితే ఇద్దరు అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రొటోకాల్ పాటించకుండా సెలవుపై వెళ్లారనే ప్రచారం సాగుతుంది. గవర్నర్ గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తారు. దమ్మపేటలో ఆమె గిరిజనులతో మాటా మంతీ జరపనున్నారు. అయితే గిరిజనుల సంక్షేమానికి సంబందించిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ సైతం సెలవులో వెళ్లిపోయారు.
రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మద్య ఉన్న విబేదాలు ఇప్పుడు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి సాక్షిగా మరింత బహిర్గతం అవుతున్నాయి. ఈ సంఘటనలు భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయననే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. తనకు జరుగుతున్న అవమానాలపై తమిళిశై ఎలా స్పందిస్తారోని టీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు.