ఇరవై నాలుగు గంటల క్రితమే మహిళాదర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నానని ..అలా ప్రకటించగానే ఇలా అనేక మంది స్పందించారని తెలంగాణ గవర్నర్ తమిళిశై .. తన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలతో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వైపు నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ.. తమిళిసై ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపుగా మూడు వందల మంది మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఎక్కువ మంది తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించే వివరించారు.
‘గవర్నర్ ప్రజలను కలుస్తారా..? లేదా అని అడిగారు. కరోనా సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వద్దన్నా నిమ్స్ ఆస్పత్రిలో రోగుల బాగోగులను తెలుసుకున్నాను. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకు ఒకసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నాం’ అని గవర్నర్ తెలిపారు. తెలంగాణ కోసమే పని చేస్తున్నానని, మహిళలకు అండగా ఉంటానని, తనని ఆపే శక్తి ఎవరికీ లేదని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహిళలు ఇబ్బంది పడితే తాను చూస్తూ ఉండలేనని, బాధిత మహిళలకు మధ్య వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు.
అదే సమయంలో ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు అడ్డుకున్నా తాను ఆగబోనన్నారు. రాజ్ భవన్కు ప్రజాదర్భార్ నిర్వహించడానికి అధికారం ఉందని స్పష్టం చేశారు. ముందు ముందు ఇంకా నిర్వహిస్తామన్నారు. తాను చేసే పనులకు ఎవరూ అడ్డు చెప్పినా పట్టించుకోననన్నారు. అయితే మొత్తంగా ఈ కార్యక్రమం బీజేపీ నేతలు ఆర్గనైజ్ చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం టీఆర్ఎస్లో వినిపిస్తోంది. ఇక గవర్నర్ కు కేంద్రం డ్యూటీ అప్పగించినట్లేనని.. ఇక నుంచి తమిళిశై వైపు నుంచి మరింత దూకుడుగా నిర్ణయాలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.