తెలంగాణ గవర్నర్ తమిళిశై మెల్లగా తాను చేయాలనుకున్నది చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తన చేతికి మట్టి అంటకుండా బియ్యం స్కాం విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగేలా ఆమె స్కెచ్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు బియ్యం స్కాంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతలందరూ వెళ్లి గవర్నర్‌ను కలిశారు . బియ్యం స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. గవర్నర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. వెళ్తూ..వెళ్తూ.. బియ్యం స్కాం పూర్వాపరాలు తీసుకుని వెళ్లి.. సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గవర్నర్ పరోక్షంగా అంగీకరించారు.
తెలంగాణలో జరిగిన బియ్యంస్కాంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని వారు సీబీఐ విచారణ చేయించాలని విజ్ఞాపన పత్రం ఇచ్చారని.. తాను దాన్ని కేంద్రానికి పంపించానని చెప్పారు. ఇప్పుుడుఈ ఫిర్యాదు మేరకు కేంద్రం సీబీఐ విచారణ చేపడితే కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. సీబీఐ దర్యాప్తు చేయాలని ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సుచేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే స్కాం జరిగింది ఎఫ్‌సీఐలో. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆటోమేటిక్‌గా అది మిల్లర్ల దగ్గరకు వస్తుంది.
అలా వచ్చిందంటే… కాంగ్రెస్ నేతలు చేస్తున్న వేల కోట్ల స్కాం ఆరోపణల్లో నిగ్గు తేలుతుంది. సీబీఐ విచారణ చేయించాలని బీజేపీ అనుకుంటే.. తన చేతికి మట్టి అంటకుండా.. కాంగ్రెస్ ఫిర్యాదు ద్వారా గవర్నర్ సిఫారసు ద్వారా చేయించేయవచ్చు. అదే జరిగితే… తెలంగాణలో కొత్త రాజకీయం ప్రారంభమవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్తలు ఇప్పటికే టీఆర్ఎస్ ఆర్థిక మూలాల్లాంటి సంస్థలపై దృష్టి పెట్టాయన్న ప్రచారం జరుగుతోంది.