బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో దశలవారిగా మధ్య నిషేధం అమలుచేయడం మొదలుపెట్టారు. ఆ హామీ కారణంగానే రాష్ట్రంలో చాలా మంది మహిళలు ఆయన కూటమికే ఓట్లు వేసినట్లు సర్వేలలో తేలడంతో తమిళనాడు (అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి) ముఖ్యమంత్రి జయలలిత కూడా తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే, రాష్ట్రంలో దశలవారిగా మద్యనిషేధం అమలుచేస్తామని ప్రకటించారు. చెన్నైలోని తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాధాకృష్ణ నగర్ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ప్రజలకు ఈ హామీ ఇచ్చేరు. గత ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న జయలలిత తలుచుకొంటే ఎప్పుడో మద్యనిషేధం అమలు చేసి ఉండేవారు కానీ అది చాలా కష్టం, పైగా దాని వలన రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోవలసి ఉంటుంది కనుకనే ఇంత కాలం అటువంటి ఆలోచన చేయలేదు. ఈసారి ఎన్నికల ప్రచారంలో తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి డిఎంకె పార్టీ మద్యనిషేధం హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందడం చేతనే ఆమె కూడా ఈ హామీ ఇస్తున్నట్లు భావించవచ్చును. అయితే అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయడం సాధ్యం కాదని, దశల వారిగా అమలుచేయవలసి ఉంటుందని చెప్పారు. అయితే ఆ ప్రక్రియని ఎప్పటిలోగా పూర్తి చేయాలనుకొంటున్నారో నిర్దిష్టంగా చెప్పకపోవడం గమనిస్తే ఆమె తన హామీని నిలబెట్టుకొంటారో లేదో అనుమానమే.