స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ.. ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన బిల్లు పొరుగు రాష్ట్రాలకు పెద్ద వరం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లును బూచిగా చూపించి.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు.. ఏపీకి రావాల్సిన పరిశ్రమలను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. అమలు ప్రారంభించాయి కూడా. తమిళనాడు అయితే మరింత దూకుడుగా ఉంది. ఇప్పటికే.. ఏపీలో ప్లాంట్లు పెట్టేసిన పరిశ్రమలను.. కూడా.. తమ రాష్ట్రానికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఏపీతో పోలిస్తే.. తమిళనాడు ఎంతో అనుకూలం అంటూ.. తమిళనాడుకు చెందిన అధికారులు, వ్యాపారవేత్తలు.. ముసుగులో ప్రచారం ప్రారంభించేశారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అయిన చిత్తూరు జిల్లాలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చేసే ప్రయత్నం చేసింది. శ్రీసిటీలో పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు.. తమ ఉత్పాదక యూనిట్లు ప్రారంభించారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు మోబైల్ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. టీసీఎల్, రిలయన్స్ జియోతో పాటు.. అనేక సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ పరిశ్రమలన్నింటినీ తమిళనాడు టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల నుంచి ఎన్నో ఎంక్వైరీలు వస్తున్నాయని… కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తమిళనాడు శాఖ బేరర్ చంద్రమోహన్ చెబుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న తమ నిర్ణయంపై చాలా మంది చింతిస్తున్నారని అంటున్నారు.
ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు.. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఏపీ నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు భూములు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తే.. తమిళనాడుకు ఏపీ పరిశ్రమలు భారీగా వస్తాయని అంటున్నారు. అటు కర్ణాటకలోనూ.. ఇదే తరహా అభిప్రాయం ఉంది. కర్ణాటక శివార్లవైపు.. ఏపీ పరిశ్రమలు చూస్తున్నాయన్న ప్రచారం ఉంది. కియ అనుబంధ పరిశ్రమలు ఇప్పటికే.. కర్ణాటకకు తరలిపోతున్నాయ్న ప్రచారం జరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో.. ఏపీలో పరిశ్రమలు పెట్టిన పారిశ్రామికవేత్తలు ఎంక్వైరీలు పెరిగిపోవడంపై.. ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. స్థానికులకు ఉద్యోగాలనే నిబంధన… అసలు ఉద్యోగాలే లేకుండా చేస్తే.. మొదటికే మోసం వచ్చినట్లవుతుంది.