తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలకు తాయిలాలు ప్రకటించారు అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు పెద్దపీట వేశారు. అందులో భాగంగా పెట్రోల ధరపై ఉన్న వ్యాట్‌ను రూ. మూడు వరకూ తగ్గించారు. ఈ అంశంపై ఏపీలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పొరగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ఎక్కువ. అందులోనూ లీటర్‌పై మరో రూపాయి రోడ్ల అభివృద్ధికి సెస్ విధించారు. ఈ క్రమంలో తమిళనాడులో వ్యాట్ తగ్గించారు ఏపీలోనూ తగ్గించాలన్న డిమాండ్లు రాజకీయ పార్టీలు వినిపించడం ప్రారంభించాయి. కానీ అసలు స్టాలిన్ వ్యాట్ తగ్గించడం వెనుక వేరే కోణం ఉందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.
సరిహద్దుల్లో ఉన్న వారంతా ఇక తమిళనాడు బోర్డర్‌కు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని వస్తారని అంటున్నారు. వాణిజ్య వాహనాలన్నీ అదేపని చేస్తాయని ఇక సామాన్యులు కూడా అదే బాట పడతారని అంటున్నారు. ప్రస్తుతం రూ. మూడు వ్యాట్ తగ్గించిన తర్వాత తమిళనాడు .. ఏపీ మధ్య పెట్రోల్ రేట్ల తేడా కనీసం రూ. ఏడు వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో రూ. 110 లీటర్ పెట్రోల్ ఉంటే అది తమిళనాడులో రూ. 103గానే ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు చెన్నై బోర్డర్లో అటు హోసూరు బోర్డర్లో ఉండేవారంతా… తమిళనాడుకే వెళ్లి పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటారు. అంటే ఏపీలో అమ్మకాలు తగ్గిపోతాయి.. తమిళనాడులో పెరుగుతాయి. ఏపీలో ఉన్న ధరల కారణంగా వ్యాట్ తగ్గించినా .. అమ్మకాలు పెరుగుతాయి కాబట్టి ఆదాయం తగ్గదనే అంచనాతోనే స్టాలిన్ రేట్లు తగ్గించారని అంచనా వేస్తున్నారు.
ఏపీ పొరుగు రాష్ట్రాల పెట్రోల్ బంకులు ఇప్పటికే…సరిహద్దు దాటితే పెట్రోల్ రేటు ఎంత పెరుగుతుందో పెద్ద ఎత్తున బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నాయి. ఏపీలోకి వెళ్లక ముందే పెట్రోల్ కొట్టించుకోవాలని సలహా ఇస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడు బోర్డర్లోని పెట్రోల్ బంకులు మరింత దూకుడుగా ఈ ప్రచారాన్నిచేస్తాయి ఎందుకంటే.. పెట్రోల్ కొట్టించుకోవడానికే ఇప్పుడు పక్క రాష్ట్రం పోయే పరిస్థితి ఏర్పడుతోంది మరి..!