తెలంగాణ మంత్రి వర్గం సిఫారసు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నామినేట్ చేయడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై నిరాకరించారు. ఆ ఫైల్ ను వెనక్కి పంపించారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు కొన్న ప్రమాణాలు ఉంటాయని రాజకీయ ఎంపికలకు చేయకూడదన్న రూల్ ప్రకారం తిరస్కరించారు. ఇప్పుడు గవర్నర్ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు కానీ.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలి పదవి నుంచి గవర్నర్ హోదాకు వచ్చేశారు తమిళిసై. ఆమె నియామకాన్ని ఆమే ప్రశ్నించుకున్నట్లయిందన్న వాదన వినిపిస్తోంది.
శాసనమండలిలో ప్రాతినిధ్యం వహించే సభ్యుల్లో.. ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల కోటా, టీచర్ల కోటా తర్వాత గవర్నర్ కోటాలోనూ సభ్యులుంటారు. గవర్నర్ కోటా అంటే.. గవర్నర్ నామినేట్ చేస్తారు. మిగతా అన్ని స్థానాల్లో ఏదో ఓ దశలో ఎన్నికల్లో పోటీ పడాల్సి ఉంటుంది. తాను నామినేట్ చేయాలి కాబట్టి తనకు ఇష్టం వచ్చిన వారికి చాన్స్ ఇచ్చే అధికారం గవర్నర్కు లేదు. కేబినెట్ చర్చించి నిర్ణయించిన వారికే ఆమోద ముద్ర వేయాలి. కానీ తమిళిశై మాత్రం కేబినెట్ నిర్ణయాల్ని ధిక్కరిస్తున్నారు.
గవర్నర్లు కేబినెట్ సిఫారసు చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన సందర్భాలు దాదాపుగా లేవు. ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నేతల్నే గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తున్నారు. ఏపీలో కూడా అక్కడి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేసింది. అప్పట్లో బిశ్వభూషణ్ హరిచందన్, ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ కూడా ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి , కుంభా రవిబాబు, కర్రి పద్మ వంటి వాళ్లు గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు నేరాల్లో నిపుణులు. వారిని ఎలా గవర్నర్ ఆమోదించారు ? ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కుంభా రవి, కర్రి పద్మ అనే వాళ్లను నామినేట్ చేశారు. వీరు చోటా రాజకీయ నేతలు. ఏ రంగాల్లోనూ నిపుణులు కాదు.
కానీ తెలంగాణలో గవర్నర్ మాత్రమే తన అధికారాల్నిఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. పైగా ఇద్దరు నేతలు వివాదాస్పదమైన వారు కాదు. దాసోజు శ్రవణ్ రాజకీయంగా నిలకడలేని నేత కావొచ్చు కానీ.. ఆయనకు సామాజిక అంశాలపై స్పష్టత ఉంది. మంచి వక్త కూడా. అలాగే ఎస్టీ వర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయణ ఎలాంటి వివాదాలు లేని నేత. వారిని గవర్నర్ కోటాలో సిఫారసు చేయడం వల్ల… రాజ్ భవన్ పై పడే మరకలు ఏమీ ఉండవు. కానీ తమిళిసై… . మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మరోసారి అదే పేర్లను సిఫారసు చేస్తే… ఆమోదించాల్సి ఉంటుంది.