తెలంగాణ గవర్నర్ తమిళిశై సౌందర్ రాజన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేందుకు ఢిల్లీ చేరుకున్నారు. మాముూలుగా అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన పెద్దగా చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ను అవమానిస్తోంది. చివరికి గవర్నర్కు ప్రోటోకాల్ కూడా దక్కడం లేదు. ఈ క్రమంలో ఉగాది వేడుకల సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలానికి కారణం అయ్యాయి. ఎవరికీ తల వంచనని .. తన కార్యాచరణ తనకు ఉందని ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె అమిత్ షాతో భేటీకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది.
కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించి ఉన్నారు. ఆ దిశగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిశైతోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గవర్నర్ ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడి గవర్నర్లు చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వాలతో తలపడుతూ ఉంటారు. బెంగాల్, తమిళనాడుల్లో అదే జరుగుతోంది.
గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నందున తెలంగాణ ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ మంత్రి సలహాలు, సూచనలు గవర్నర్ తమిళిశై తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వానికి అనేక చికాకులు ఏర్పడతాయి. బెంగాల్లో అదే జరుగుతోంది. కేసీఆర్ తీరు వల్ల చాన్స్ వచ్చిందని .. బీజేపీ గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తే గాల్లో ఇదే తరహా పరిస్థితులు ఇక్కడా కనిపించే అవకాశం ఉంది.