ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై సినీ పరిశ్రమకు చెందిన సినిమా హీరోలు, కళాకారులు ఎందుకు పోరాటం చేయటంలేదని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరిగితే తమిళ హీరోలు ఉద్యమానికి నాయకత్వం వహించి, ముందుండి నడిపించారన్నారు. తెలుగు సినీ హీరోలకు, కళాకారులకు పోరాడే చేవ చచ్చిపోయిందా? ఎవరికైనా అవార్డులు రాకపోతే సామాజిక మాధ్యమాల్లో లొల్లి పెట్టేస్తారని మండిపడ్డారు. ఏపీకి నిధులు రావటం లేదంటే ఏసీ గదులను వదలరేం? అని నిలదీశారు. ఇప్పటికీ మాట్లాడకపోతే ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు సినీ పరిశ్రమను, కళాకారులను వెలివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
అయితే దీనిపై స్పందించారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సినీ పరిశ్రమపై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పిస్తే – ఆ తర్వాత మిగతావారు మాట్లాడతారని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వస్తే సినీ పరిశ్రమ కూడా కలిసి వస్తుందని అన్నారు. తమిళనాడులో జల్లికట్టుపై అందరూ ఏకతాటిపైకి వచ్చారు కనుకనే సినీ పరిశ్రమ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గతం లో విశ్లేషించినట్టుగా సినీ నటులకి వాళ్ళ సొంత వ్యక్తిగత అబిప్రాయాలు వెల్లడించడానికీ, వెల్లడించకుండా ఉండటానికీ స్వేచ్చ ఉంది. ( (https://www.telugu360.com/will-tollywood-voice-ap-bifurcation-issues-special-category-status/) )అయితే ప్రజలకి రాజకీయాలకి సినీ నటులకీ మద్య ఉండే ప్రత్యేక ఎమోషనల్ బాండింగ్ దృష్ట్యా వీరు ప్రత్యేక హోదా కోసం గళమెత్తాలి. గతం లో మంచు మనోజ్, వరుణ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, సాయి ధరం తేజ్, గోపీ మోహన్, తమ్మారెడ్డి లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చినప్పటికీ టాప్ లీగ్ కి చెందిన మెగా హీరోలు కానీ, రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి కానీ, ఎమ్మెల్యే అయిన బాలయ్య కానీ, జూనియర్ ఎన్టీయార్ కానీ, జల్లికట్టుకి మద్దతిచ్చిన మహేష్ బాబు కానీ ఎప్పుడూ గళం విప్పలేదు. వీరు కూడా మాట్లాడితే బాగుండేదని సామాన్యుల అభిప్రాయం కూడా.