కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్‌పై కొన్ని గాసిప్పులు వినిపిస్తుంటాయి. నిర్మాతల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాడని, దర్శకుల విషయంలో జోక్యం చేసుకొంటాడని, సెట్లో తన ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుందని ఇలా రకరకాలుగా చెప్పుకొంటారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజాకీ అలాంటి అభిప్రాయమే ఉండేదట. కానీ ఈమధ్య అది మారిందని చెబుతున్నారాయట. సునీల్ హీరోగా నటించిన జక్కన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌కి తమ్మారెడ్డి అతిథిగా వచ్చేసి సునీల్‌కి కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ‘సునీల్‌ని అందరిలానే నేనూ దుర్మార్గుడు అనుకొన్నా. కానీ సునీల్ బంగారం అని తనతో పనిచేసిన నిర్మాతే చెప్పాడు’ అని సునీల్‌కి తిట్టినట్టే తిట్టి పొగిడేశారు. అంతేకాదు.. ”పవన్ కల్యాణ్ లా మాస్ సినిమాలు చేయకు.. నీలా కామెడీ టైపు సినిమాలు చేయ్.. నీ నుంచి కోరుకొనేది అదే..” అంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు.
దానికి సునీల్ కూడా సమాధానం చెప్పాడు. ”ఓ పెళ్లి జరుగుతున్నప్పుడు చిన్న చిన్న లోటు పాట్లు ఉంటాయి. అందరూ అందరికీ నచ్చరు. ఫ్లాపులు ఎదురైనప్పుడు మనలో లోపాలు కనిపిస్తాయి. హిట్టొస్తే ఎవ్వరూ ఏం మాట్లాడరు” అంటూ తమ్మారెడ్డికి కౌంటర్ లాంటిది వేశాడు. పాత్రల ఎంపిక విషయంలతో రియలైజ్ అయ్యానని, ఇక నుంచి కామెడీకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నాడు సునీల్. ”నా సినిమాలకు నవ్వుకోవడానికే జనం వస్తారు. ఆ సంగతి అర్థమైంది. కళ్ల జోడు పెట్టుకొని పోజులిస్తే ఎవరూ చూడరు. అందుకే ఇక నుంచి కళ్లజోళ్లు కాన్సిల్” అంటూ నిర్మొహమాటంగా తనపై తాను జోకు వేసుకొన్నాడు. మార్పు మంచిదే. మరి సునీల్ మార్పు జక్కన్న సినిమాలో కనిపిస్తుందో లేదో చూడాలి.