స్పీకర్ తమ్మినేని సీతారాం … అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాత్రమే స్పీకర్ పాత్ర పోషిస్తూంటారు. మిగతా సందరర్భాల్లో ప్రతిపక్షంపై ఆయన చేసే విమర్శలతో వార్తల్లో నిలుస్తూంటారు. తాజాగా ఆయన.. ప్రతిపక్షంపై కాకుండా.. ప్రభుత్వ యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా నాటు సారా కనిపిస్తోందనేది.. ఆయన అభియోగం. లాక్డౌన్ సమయంలో.. అసలు మామూలు మద్యమే లభించదు. ఏపీలో అసలు దొరకదు. ఎందకంటే.. దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. కానీ నాటు సారా మాత్రం.. విపరీతంగా లభిస్తోందట. అన్ని చోట్లా నాటు సారా ఏరులై పారుతూంటే.. ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా.. అని ఆయన ఫైరయిపోయారు.
నిజానికి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి.. అక్రమ మద్యం.. నాటు సారా కట్టడి విషయంలో తాము చాంపియన్లమన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి హఠాత్తుగా ఆయన డిపార్టుమెంట్పై స్పీకర్ విరుచుకుపడ్డారు. నాటుసారా మాఫియాతో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారని ..ఈ ముఠాలు సమాజాన్ని కంట్రోల్ చేసే స్థితికి చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా నిషేధిత గుట్కాలు దొరుకుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.
తమ్మినేని వ్యాఖ్యలు సహజంగా.. ప్రతిపక్ష పార్టీలో కలకలం రేపుతాయి. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి.. ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని వారు మండిపడతారు. ఈ సారి సెగ మాత్రం.. సొంత పార్టీలోనే తగులుతోంది. నాటు సారాతో…బాగా సంపాదించేస్తున్న వారెవరి గురించో.. సీతారాంకు తెలిసి ఉంటుందని.. అందుకే ఆయనఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలు న్యాయబద్ధమైన వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నారు. ఇక అక్రమ మద్యం వ్యాపారం చేసే పరిస్థితి లేదు. చేస్తే సొంత పార్టీ వాళ్లే చేయాలి. ఈ విషయం తెలిసి తమ్మినేని విమర్శలు చేశారంటే.. ఆయన మాటల వెనుక ఏదో డిమాండ్ ఉందన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. మరి.. తమ్మినేని డిమాండ్ ను జగన్ ఆలకిస్తారో లేదో..?