స్పీకర్ తమ్మినేని సీతారం అంటే ఫైర్ బ్రాండ్. ఆయనకు రాజ్యాంగ రక్షణ ఉంది. ఆ రక్షణను ఆయన ఎలా వాడుకుంటున్నారో.. వాడుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోనియా గాంధీని అత్యంత దారుణంగా తిట్టిన వైనం దగ్గర్నుంచి న్యాయస్థానాలను సైతం దూషించిన వ్యవహారం వరకూ అన్నీ సంచలనమే. న్యాయస్థానాలను దూషించిన కేసులో.. ఆయన వ్యాఖ్యలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఆయన చేసినట్లుగా రుజువైతే నోటీసులు జారీ చేయాలని హైకోర్టుకూడా ఆదేశించింది. అప్పట్లో ఆయన ఫైర్ అలా ఉండేది. హైకోర్టు.. ఎస్ఈసీ అనిచూడకుండా … చెలరేగిపోయేవారు.
న్యాయవ్యవస్థ .. పాలనా వ్యవస్థలోకి చొరబడి వస్తోందని… ఖండించాల్సిందేనని చాలా సార్లు అన్నారు. ఓ సారి ప్రత్యేకంగా తిరుపతి పర్యటనకు వెళ్లి.. ఈ వ్యాఖ్యల పరంపర ప్రారంభించారు. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దాంతో మళ్లీ ఆయన సీరియస్ కామెంట్లు ఏవో చేస్తారని మీడియా అంతా ఆయన చుట్టూ గుమికూడారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆయన తానుకోర్టులపై కామెంట్ చేయనని చెప్పి .. సైలెంటయిపోయారు. గతంలో ఉన్న విధానానికి.. ఇప్పటి విధానానికి తేడా ఎక్కడ వచ్చిందబ్బా అని మీడియా ప్రతినిధులు గొణుక్కోవాల్సి వచ్చింది.
గతంలో పోటీ పడి హైకమాండ్ సూచనల మేరకు న్యాయవ్యవస్థపై విమర్శలు చేసిన నేతల్లో చివరికి… శ్రీకాకుళం జిల్లాకే చెందిన సీదిరి అప్పలరాజు చాంపియన్‌గా నిలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఆ మంత్రి పదవి కోసం స్పీకర్ కూడా చాలా ప్రయత్నించినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వైసీపీ పార్టీ పరంగా అలాంటి ప్రయత్నాలేమీ చేయడం లేదేమో కానీ.. అందరూ సైలెంట్‌గానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో కొంత మంది మాత్రం… విమర్శలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై మళ్లీ ఎదురుదాడి చేయాలన్న వ్యూహాన్ని ప్రారంభిస్తే.. అప్పుడు స్పీకర్ కూడా తన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందంటున్నారు.