ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్.. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో… చాలా ఆదర్శాలు వల్లించారు. స్పీకర్ అంటే..ఎలా ఉండాలో.. తాను చూపిస్తానన్నట్లుగా మాట్లాడారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో.. స్పీకర్ సమన్యాయంతో వ్యవహరించలేకపోయారని.. ప్రతిపక్షానికి కనీసం నిరసన వ్యక్తం చేసే అవకాశం ఇవ్వలేదని విమర్శలు వచ్చినా.. ఆయన మాత్రం.. స్పీకర్ అనే పదానికి తానే గొప్ప ఉదాహరణగా నిలుస్తానన్నట్లుగా చెప్పుకున్నారు. రాజకీయాల్లో తన పార్టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకున్నా.. మీడియా విషయంలో.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం.. సమర్థించుకోలేకపోయారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను గొప్పగా చెప్పిన స్పీకర్… వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కానీ.. అసెంబ్లీ ప్రసారాల సమయంలో.. మూడు చానళ్లను నిషేధించడానికి సమర్థమైన కారణం ఏమిటో మాత్రం వివరించలేకపోయారు. శాసన సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ నుంచి లైవ్ లు ఇవ్వకూడదని నిబంధన ఉందని.. భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే తాత్కాలిక నిషేధం విధించామని చెప్పుకొచ్చారు. నిజానికి.. ఆయా చానళ్లు యాధృచ్చికంగా మాత్రమే లైవ్ ఇచ్చారు. తప్పు తెలుసుకుని.. మూడు, నాలుగు నిమిషాల్లో కట్ చేశాయి. అదే వివరణ కూడా ఇచ్చాయి. అయితే.. ఆ వివరణను స్పీకర్.. పట్టించుకోలేదు. పరిశీలిస్తామన్నట్లుగా చెప్పారు.
నిజానికి.. మీడియాపై.. ఇంత చిన్న నిబంధన పేరుతో… చర్యలు తీసుకోవడం ఉమ్మడి రాష్ట్రంలోనూ జరగలేదు. మహా అయితే.. వివరణ తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ హయంలో… సాక్షి మీడియా గ్రూప్.. ఏకంగా అసెంబ్లీపైనే ఎన్నో అభ్యంతరకమైన రాతలు రాసింది. స్వయంగా స్పీకర్ పైనే.. అనుచితమైన వ్యాఖ్యలు సాక్షి మీడియాలో వచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఎప్పుడూ కూడా మీడియా.. అనే గౌరవంతోనే… స్పీకర్ సాక్షిని అసెంబ్లీలోకి రాకుండా.. అడ్డుకోలేదు. ఎలాంటి చర్యలపై ఆలోచన కూడా చేయలేదు. కానీ దానికి భిన్నంగా… ఇప్పుడు… మూడు చానళ్లను టార్గెట్ గా పెట్టుకుని మరీ అసెంబ్లీ ప్రసారాలపై నిషేధం విధించారు. ప్రజలకు అందకుండా చేశారు. దాని వల్ల… అసెంబ్లీకి ఎంత లాభం జరిగిందో కానీ.. మీడియా గొంతు నొక్కుతున్నారనే అంశం మాత్రం ప్రజల్లోకి వెళ్లింది!