మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య విషయంలో మీడియా ఇస్తున్న “అతి” కవరేజ్ కారణంగా…రాజకీయాల్లోనూ విచిత్రాలు చోటు చేసుకుంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో.. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా.. అందరూ… ప్రణయ్ ఇంటికి వెళ్లి.. అమృతను ఓదారుస్తున్నారు. ఈ క్రమంలో … కొంత మందిని పూనకాలొచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ఇతర పార్టీల నేతల సంగతేమిటో కానీ… కమ్యూనిస్టు పార్టీల నేతలకు మాత్రం.. మిర్యాలగూడలో అడుగుపెట్టగానే… ఏదోలా అయిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం స్థితికి.. అంటే “పూనకం” వచ్చిన పరిస్థితిల్లోకి వెళ్లిపోతున్నారు. కొంత మంది.. ఢిల్లీ లాంటి దూర ప్రాంతాల్లో ఉంది.. ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతున్నారు.
సీపీఐ పార్టీ తరపున జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన నారాయణ…ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ప్రణయ్ హత్య గురించి ఆయన కాస్త ఆలస్యంగా స్పందించారు. కానీ ఆవేశంలో మాత్రం.. తన మార్క్ ఏ మాత్రం తగ్గనీయలేదు. అమృత తండ్రిని ఎన్కౌంటర్ చేసి పారేయాలని తీర్పు చెప్పేశారు. కోర్టులు, విచారణ పేరుతో కాలయాపన చేయాల్సిన అవసరం లేదట. ఓ జాతీయ పార్టీలో కీలక నేతగా ఉన్న.. నారాయణ.. బాధ్యతగా మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. కానీ… “పూనకం” వచ్చింది కాబట్టి… అనేశారు. ఇక సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం… పూనకం.. ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన ఏకంగా… “అమృతను… ఏకగ్రీవంగా…అసెంబ్లీకి పంపాలని తీర్మానించేశారు”. మిర్యాగలగూడ మాజీ ఎమ్మెల్యే అయిన తమ్మినేని వీరభద్రం.. అమృతను పరామర్శించి..” ఈమెను కుల వ్యవస్థ విధ్వంసానికి దిక్సూచిలా చూడాలి. ఒక దళితుడ్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఆమె పడిన కష్టాలకు ఉపశమనం కలిగించాలి. మిర్యాలగూడ నుంచి ఆమెను ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపుదాం.. ఇందుకోసం అన్ని పార్టీలూ అభ్యర్థుల్ని పెట్టకుండా ఏకగ్రీవానికి తోడ్పడాలి..” అని పిలుపునిచ్చేశారు.
మొత్తానికి కమ్యూనిస్టు నేతలు.. కుల రాజకీయాలు వద్దంటూ… కుల రాజకీయాల్ని చేయాడానికి చాలా శ్రమిస్తున్నారని.. మిర్యాలగూడ ఘటనలపై వారి స్పందన చూస్తనే అర్థమైపోతుంది. ప్రణయ్ హత్య .. కచ్చితంగా ఖండించాల్సిందే. కానీ ఆ హత్యను అడ్డం పెట్టుకుని.. శవ రాజకీాయలు చేసే ప్రయత్నం చేయడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇతర పార్టీల నేతలను మించి… కమ్యూనిస్టు నేతలు.. స్పందిస్తున్నారు. ప్రజలు నవ్వుకుంటారనే విచక్షణను కూడా మర్చిపోతున్నారు. బాధితురాలికి ధైర్యం చెప్పాలి. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. కానీ..అది కమ్యూనిస్టు నేతల పద్దతిలో కాదేమో..?