జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పొత్తుల విషయంలో తాము ఎన్ని సార్లు కలిసేందుకు ప్రయత్నించినా పవన్ కల్యాణ్ అందుబాటులోకి రావడం లేదని ఆయన నేరుగా మీడియాకే చెబుతున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వెళ్లడానికి పవన్ వెనుకడుగు వేస్తున్నారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కు ఈ విషయంపై లేఖ రాశామని ఆయన చెప్పిన తర్వాత .. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ దీనిపై చర్చించింది. తర్వాత తమ్మినేని వీరభద్రంతోనూ మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. గత ఆదివారం ఈ విషయంపై రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు జనసేన వర్గాలు ప్రకటించాయి. మంగళ, బుధవారాల్లో స్వయంగా పవన్ కల్యాణే.. తమ్మినేని వీరభద్రంతో చర్చించి.. ఆ మేరకు ముందుకెళ్తామని ప్రకటించారు. అది ఫేస్ బుక్ ప్రకటనకే సరిపోయింది. ఆ తర్వాత జనసేన నుంచి సీపీఎంను ఎవరూ సంప్రదించలేదు. సీపీఎం నేతలు.. జనసేన వర్గాలను సంప్రదించాలనుకున్నా కుదరలేదు. దీంతో చర్చలు జరగలేదు.
తెలంగాణలో మహాకూటమి సిద్ధమయింది. ఒక్క సీపీఎం మినహా మిగతా పార్టీలన్నీ ఆ కూటమిలో చేరాయి. సీపీఎంనూ ఆహ్వానిస్తామని ఆ కూటమి నేతలు ప్రకటించారు. ఈ విషయంపై.. మీడియాతో మాట్లాడిన తమ్మినేని వీరభద్రం… మహాకూటమిలో సీపీఎం చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్‌తో కలవటానికి మేం సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నయం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని వివరించారు. సీపీఎం నేతృత్వంలో కొన్ని ప్రజాసంఘాలు కలిసి బీఎల్ఎఫ్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి.. జనసేనతో పొత్తు పెట్టుకని పోటీ చేయాలని భావించింది. సీపీఎం నేతలు ఎంత తగ్గి ప్రయత్నించినా.. జనసేన మాత్రం.. బెట్టు చేస్తోందన్న అభిప్రాయాలు సీపీఎం నుంచి వస్తున్నాయి. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వెళ్లడంపై జనసేనకు అభ్యంతారాలున్నాయేమో? అన్న అనుమానాలను తమ్మినేని వీరభద్రం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నా.. అదుబాటులోకి రావడం లేదన్నారు. మా రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన మాతో కలసి రాకపోవచ్చునని కూడా ఆయన హింట్ ఇచ్చారు. జనసేన కలసి రాకపోయినా.. మహాకూటమితో కలసి పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణలో పొత్తులపై జనసేన అధినేత వ్యవహరిస్తున్న తీరు.. రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పొత్తులు పెట్టుకునే ఉద్దేశం లేకపోతే.. ముందుగానే ఆ మాట చెప్పేయవచ్చు కానీ..ఇలా సీపీఎం నేతలను… అవమానించడం ఏమిటన్న సందేహం అందరిలోనూ వస్తుంది. ఓ వైపు.. ఈ సారికి .. తెలంగాణలో జనసేన పోటీ చేయబోవడం లేదనే ప్రచారం ఊపందుకుంటోంది. పవన్ కల్యాణ్ తీరు చూస్తే అదే నిజమేమో అన్నట్లుగా పరిస్థితి ఉందని.. ఇతర రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.