ఇటీవలే అతి పెద్ద పాదయాత్రపూర్తి చేసి బ్రహ్మాండమైన బహిరంగ సభతో ముగించిన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నాయకులు సిహెచ్ సీతారాములు తదితరులు జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలసి చర్చలు జరిపారు. తెలంగాణలోనే గాక ఎపిలోనూ దేశంలోనూ వున్న రాజకీయ పరిస్థితుల గురించి కార్యాచరణ గురించి తాము చర్చించినట్టు వీరభద్రం తర్వాత పవన్ సమక్షంలోనే మీడియాతో చెప్పారు. ఇప్పటికి తాము సమస్యలను చర్చించామని ధర్నాచౌక్ ఎత్తివేతకు వ్యతిరేకంగా మే15న పెద్దఎత్తున జరిగే నిరసనకు జనసేన మద్దతు నిచ్చిందని ఆయన వివరించారు. దానికి ముందు పవన్ మాట్లాడుతూ తమ్మినేని పాదయాత్రను అభినందించారు. దాని గురించిన వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. నిరసన తెల్పడం ప్రజాస్వామ్య హక్కు లని, ధర్నాచౌక్‌లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో సహా అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం పరిపాలన ఇక్కడ వుంటే మరెక్కడో దూరంగా నిరసనలు చెయ్యాలనడం న్యాయం కాదని ఖండించారు. దీనిపై జరిగే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తమ కార్యకర్తలకు చెబుతానన్నారు. ఇక కలసి పనిచేయడం, ఎన్నికల పొత్తులు వంటివాటిపై తమ పార్టీ నిర్మాణం జరిగాక ఆలోచిస్తామన్నారు. ఇది ప్రారంభ మేనని ఈ క్రమం అక్కడి వరకూ వెళుతుందని తమ్మినేని అన్నారు. ఇంతకూ గద్దర్‌తో కలసి పవన్‌కళ్యాణ్ తెలంగాణలో పనిచేయాలని వ్యూహరచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో ప్రత్యామ్నాయం పెంపొందించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని రాజకీయవర్గాలు వూహిస్తున్నాయి. గతంలో ఎపి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా పవన్‌ను కలుసుకున్నారు. పవర్ స్టార్ మాత్రం తమ పార్టీ నిర్మాణం తర్వాతనే ఇవన్నీ ఆలోచించగలమని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమావేశం మాత్రం మీడియాలోచాలా ప్రచారం పొందింది.