వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో.. ఎలాగోలా..ఉనికి నిలుపుకోవాలనుకుంటున్న… కమ్యూనిస్టు పార్టీలకు.. ఆశాదీపంగా.. జనసేన మాత్రమే కనిపిస్తోది. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలతో గతంలో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు.. కమ్యూనిస్టులకు ఉన్న బలంతో పోలిస్తే… ఆయా పార్టీలు పొత్తులకు సిద్ధపడతాయో లేదో తెలియదు. సిద్ధపడినా.. సీట్లు ఇస్తాయో లేదో అస్సలు అంచనా వేయలేరు. అదే జనసేన అయితే.. కాస్తంత గౌరవప్రదంగా సీట్లు లభిస్తాయని.. కమ్యూనిస్టుల అంచనా అందుకే.. జనసేనతో పొత్తు కోసం.. కమ్యూనిస్టులు ఆరాట పడుతున్నారు. పొత్తుల విషం తేల్చాలని.. పవన్ కల్యాణ్‌కు లేఖ రాసినట్లు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఎన్నికల్లో పొత్తుపై వారం రోజుల్లో పవన్‌తో చర్చలు జరుపుతామని కూడా ప్రకటించారు. తమ్మినేని తెలంగాణ తరపునే ప్రకటన చేసినా.. అది ఏపీకి కూడా వర్తిస్తుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల వ్యూహం… ఏమిటో అర్థం కాక వామపక్ష పార్టీలు టెన్షన్‌కు గురవుతున్నాయి. తమతో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ కల్యాణ్… వచ్చే ఎన్నికల్లో పొత్తులకు వస్తాడా లేదా అనేది వారికి పెద్ద మిస్టరీగా మారింది. పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం వారు చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ మనసును సంతోషపరిచేలా.. మంచి మాటలు చెబుతూనే ఉన్నారు. పవన్ నాయకత్వన్ని పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ గెలవబోతున్నాడని జోస్యాలు కూడా చెప్పుకొచ్చారు. కానీ పవన్ కల్యాణ్ నోటి వెంట ఇప్పటి వరకూ పొత్తులనే మాట బయటకు రాలేదు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదికగా.. కమ్యూనిస్టులు, జనేసన, లోక్ సత్తా సహా కలసి వచ్చే ఇతర పార్టీలన్నింటితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్పష్టం చేశారు. అయినప్పటికీ జనసేవ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు… తెలంగాణలో ఉనికి చాటుకున్నా.. ఏపీలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఎవరూ పొత్తులు పెట్టుకోకపోవడంతో.. ఒంటరిగా పోటీ చేశారు. ఎక్కడా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఈ సారి అసెంబ్లీలో తమ ఉనికిని చాటుకోకపోతే.. భవిష్యత్ ఉండదని భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీలు పొత్తులకు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువే. అందుకే జనసేనపైనే వామపక్షాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి.కానీ పవన్ మాత్రం వారిని వెయిటింగ్లో పెట్టారు. ఏమీ చెప్పడం లేదు. కానీ అప్పుడప్పుడు తాము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతూ షాక్ ఇస్తున్నారు. అంతే కాదు.. ఇప్పుడు.. కలుద్దామని వెళ్తే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది.