ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు వాషింగ్టన్ డీసిలో ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, రంగస్థల నటులు, నృత్యకళాకారిణులు,గాయనీగాయకులు, సాహితీవేత్తలు, బిజినెస్ ప్రముఖులు ఇలా ఎంతోమంది హాజరవుతున్నారు.
అమెరికా కమ్యూనిటీని ఈ మహాసభల్లో పాల్గొనేలా తానా అనేక కార్యక్రమాలను చేపట్టింది. కమ్యూనిటీని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు వీలుగా వివిధ కార్యక్రమాలను తానా కాన్ఫరెన్స్ నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు,వివిధ రకాల పోటీలను నిర్వహించడం ద్వారా అమెరికాలోని తెలుగు కమ్యూనిటీని ఇందులో భాగస్వాములు అయ్యేలా చూస్తోంది. ధీంతానా పోటీల ద్వారా ఆటపాటల ప్రతిభను వెలికితీస్తోంది. తానా-క్యూరీ సంస్థతో కలిసి చిన్నారులకు నిర్వహిస్తున్న సైన్స్, మ్యాథ్స్, స్పెల్‌బీ పోటీలను నిర్వహించి వారి ప్రతిభకు పదునుపెడుతోంది. పాఠశాలతో కలిసి తెలుగు పోటీలను నిర్వహించి తెలుగు భాషలో వారి పటిమను వెలికితీస్తోంది.
ఇలా ఓవైపు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు క్రీడాపోటీల్లో కూడా నైపుణ్యం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేసింది. ఈ టోర్నమెంట్లో పాల్గొనడంతోపాటు విజేతగా నిలిచినవారికి బహుమతులను అందిస్తోంది.
క్రికెట్, వాలీబాల్, యూత్ క్రికెట్, త్రోబాల్, టెన్నిస్, రన్నింగ్, గోల్ఫ్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పోటీలను తానా మహాసభల (TANA conference) సందర్భంగా ఏర్పాటు చేసింది. అన్నీ వయస్సులవారు ఇందులో పాల్గొనేలా ఆటల పోటీలను రూపొందించింది. మే నెలలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఫన్ ప్లే, టోర్నమెంట్లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలను పురుషులకు, మహిళలకు ఏర్పాటు చేసింది. 16ఏళ్ళ వయస్సులోపు ఉన్న బాలురకు, బాలికలకు కూడా పోటీలను నిర్వహించింది.
ఏప్రిల్ నుంచి తానా క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించింది. ఇందులో విజేతగా నిలిచినవారికి 3200డాలర్ల నగదు బహుమతిని అందిసస్తోంది. జూన్ నుంచి తానా యూత్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. విజేతలకు, రన్నరప్‌లకు ట్రోపీలను బహుకరిస్తున్నారు. తానా వాలీబాల్ టోర్నమెంట్‌ను జూన్15న ఏర్పాటు చేసింది. ఇందులో గెలిచినవారికి 2000డాలర్ల నగదుబహుమతిని అందిస్తోంది. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే ఆటల పోటీలు కూడా కమ్యూనిటీని ఎంతో ఆకట్టుకుంటోంది. ఎంతోమంది ఈ క్రీడాపోటీల్లో పాల్గొని తమ సత్తాను ప్రదర్శించేందుకు ముందుకు వస్తున్నారు. మానసికోల్లాసాన్ని కలిగించే ఇలాంటి ఆటల పోటీలు కమ్యూనిటీకి ఎంతో ఉపయోగకరమని తానా పేర్కొంటోంది. అందరూ ఈ పోటీల్లో పాల్గొనడంతోపాటు, తానా మహాసభలకు రావాల్సిందిగా కోరుతోంది.
ఇతర వివరాలకోసం సందర్శించండి: www.tana2019.org.
Press release by: Indian Clicks, LLC