సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లూ `మనో భావాల`ను గట్టిగా దెబ్బ తీయడం మొదలెట్టాయి. తాజాగా.. `తాండవ్` పై ఓ వర్గం కన్నెర్ర చేస్తోంది. ఈనెల 15న అమెజాన్ ప్రైమ్ లో తాండవ్ వెబ్ సిరీస్ విడుదలైంది. తొలి రోజే.. వివాదాలు మొదలైపోయాయి. సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు.
ఈ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్ల పై కొన్ని సెటైర్లు పడ్డాయి. అదే.. ఇప్పుడు వివాదాలకు హాట్ స్పాట్ గా మారింది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్ సిరీస్ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబయిలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాజపా ఎంపీ మనోజ్‌కుమార్ కొటక్ కూడా ఈ విషయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్కు లేఖ రాశారు. ఈ వెబ్ సిరీస్ ని తక్షణం నిలిపి వేయాలని, లేదంటే.. ఆందోళనని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారాయన. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ముంబయి శివారులో ఉన్న సైఫ్ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. `ఓ మై గాడ్`, `పీకే` సినిమాల విడుదల సమయంలోనూ.. సరిగ్గా ఇలాంటి విమర్శలే వినిపించాయి. అవి ఆయా చిత్రాలకు పబ్లిసిటీ కి బాగా ఉపయోగపడ్డాయి. తాండవ్ కీ అంతేనేమో..?