తెలుగులో తాప్సిని సొట్టబుగ్గల సుందరిగానే గుర్తించారు. ఆమె నటనకు, ఆమెలోని ప్రతిభకు సత్తాకూ.. పరీక్ష పెట్టే పాత్ర ఒక్కంటే ఒక్కటీ దక్కలేదు. ఆ అసంతృప్తితో బాలీవుడ్ వలస వెళ్లిపోయింది. వాళ్లు మాత్రం తాప్సికి బ్రహ్మరథం పట్టారు. పింక్ లాంటి సినిమాల్లో తాప్సి అసలైన నటన బయటకు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ అయ్యింది.
అయితే తొలి నాళ్లలో తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయని, తననంతా చిన్న చూపు చూసేవారని, ఆ అవహేళనలన్నీ ఓపిగ్గా భరించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తాప్పి. ”నేను నటించిన సినిమాలు ఒకట్రెండు ఫ్లాప్ అయ్యేసరికి నాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు… ఆ హీరో భార్యకు నేను నచ్చలేదంటా. అందుకే చెప్పాపెట్టకుండా నన్ను తీసేశారు. ఓసారి నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆ తరవాత గొంతు బాగోలేదని వేరే వాళ్లతో డబ్బింగ్ పూర్తి చేశారు. కనీసం ఆ విషయం కూడా నాతో చెప్పలేదు. ఆఖరికి ఓ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు `మీ హీరోకి హిట్టు లేదు.. కాబట్టి నువ్వు కూడా పారితోషికం తగ్గించుకో` అన్నారు. హీరోలకు హిట్ లేకపోతే.. నేనెందుకు పారితోషికం తగ్గించాలో అర్థం కాలేదు. ఇలాంటి అవమానాలెన్నో భరించాను. నేనే కాదు.. దాదాపు ప్రతి కథానాయికకీ ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉంటాయి. వాటిని దాటుకుని రావడం అంత తేలిక కాదు” అని చెప్పుకొచ్చింది తాప్పి. ఇంతకీ తాప్సిని సినిమాలోంచి తీసేసిన ఆ హీరో గారి భార్య పేరేంటో చెప్పనే లేదు.