”ఝుమ్మందినాధం” సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ సోయగం తాప్సి. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే తాప్సీ ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూనే సాగింది. ఎక్కడ లోపమో కానీ ఆమెకు ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదనే చెప్పాలి. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కొట్టినా ఆమెకు అది కలసి రాలేదు. తర్వాత వచ్చిన వీర, మొగుడు ,దరువు, షాడో సినిమాలు నిరాశ పరిచాయి. దీంతో తాప్సీ ని లైట్ తీసుకున్నారు ఇక్కడ దర్శక నిర్మాతలు. అయితే తాప్సీ మాత్రం తన ఫోకస్ ను బాలీవుడ్ కు షిఫ్ట్ చేసింది. అక్కడ నటిగా ఎదగాలని ప్రణాళికలు రచించుకుంది. ఇందులో సక్సెస్ అయ్యింది కూడా.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ పంచుకున్న ‘పింక్’ చిత్రం ఆమెకు విశేష గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో అమితాబ్ కు మించి ప్రసంశలు దక్కించుకుంది తాప్సీ. ఆలాగే అంతకు ముందు చేసిన ‘బేబీ’ చిత్రం కూడా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నటనకు మాత్రమే ఆస్కారం వుండే పాత్రలు చేస్తున్న తాప్సీ.. తాజాగా ఘాజీ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా మాత్రం ఆమెకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. ఘాజీ అద్భుతంగా వుందని కితాబిస్తున్నారు అందరు. ఇందులో నటించిన రానాకు మిగతా నటులకు ప్రసంసలు అందుతున్నాయి. అటు దర్శకుదిగా సంకల్ప్ కూడా ఫుల్ మార్కులు కొట్టేశాడు.
అయితే ఇందులో కనిపించిన తాప్సీ పాత్ర మాత్రం తేలిపోయింది. అసలు ఆ పాత్ర్ర ఎంట్రీ , ఎక్సయిట్ ఏంటో రిజిస్టర్ చేయలేదు. ఆమెకు ఇచ్చిన సన్నివేశాలన్నీ ఫైనల్ ఎడిటింగ్ లో లేపేశారు. ఈ సినిమా కోసం తాప్సీ బెంగాలీ నేర్చుకుందట. అయితే ఒకే ఒక్క డైలాగ్ చెప్పించారు. ఆ మాత్రానికి బెంగాలి నేర్చుకోవడం ఏమిటో?! ఆమెకి ఇచ్చిన సన్నివేశాలకు కత్తెరపడిపోయింది. ఈ సినిమా అద్భుతంగా వుందని చెబుతున్నా… తాప్సీకి మాత్రం ఇది కలసిరాలేదు. ఇప్పుడు తాప్సీకి వరుసగా మంచి పాత్రలు పడుతున్నాయి. ఘాజీ కూడా తనకు ప్లస్ అవుతుందని ఆశలు పెట్టుకుంది తాప్సీ. అయితే ఈ విషయంలో ఆమెకు నిరాశే మిగిలింది.