హైదరాబాద్: విజయవాడ పోలీసులు తనపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని సినీనటి తారా చౌదరి ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెడతారని, రౌడీ షీట్ తెరుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తారా చౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబంలో జరిగిన గొడవపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తనపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ రాముడు తనను వారి ఇంటిలోని ఆడపిల్లలాంటిదానిగా భావించాలని కోరారు. తానే తప్పూ చేయలేదని అన్నారు. విజయవాడ దుర్గమ్మపై ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. తాను తప్పు చేసిఉంటే పీడీ యాక్ట్ కాదు, ఉరితీసినా అంగీకరిస్తానని చెప్పారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే మరుక్షణమే తానే ఉరి తీసుకుంటానని అన్నారు. తానెప్పుడూ కూడా తప్పుచేయలేదని, తనపై ప్రతిసారీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. నార్కో ఎనాలసిస్‌తో సహా ఏ విచారణకైనా తాను సిద్ధమేనని అన్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన తారా చౌదరి, తనకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పలువురు ప్రముఖుల రాసలీలల వీడియో సీడీలు పోలీసులకు లభ్యమవటం రాష్ట్రమంతా చర్చనీయాంశమయింది. తాజాగా సొంత వదినపై, ఒక మహిళా కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేశారని విజయవాడలో సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.