అమరావతిలో తొలిసారి విలన్ గా కనిపించాడు తారకరత్న. తారక్ విలనేంటిలే.. అనుకొన్నవాళ్లందరికీ ఆ సినిమాతో షాక్ ఇచ్చాడు. నంది అవార్డు అందుకొన్ని.. ఇంకాస్త ఆశ్చర్యపరిచాడు. అమరావతి చూశాక తారకరత్న హీరోగా కంటే విలన్‌గానే బెటర్ అనుకొన్నారంతా. కానీ అదేం విచిత్రమో ఆ తరవాత అలాంటి అవకాశాలు కూడా రాలేదు. సుదీర్ఘ విరామం తరవాత రాజా చేయివేస్తేలో మళ్లీ విలన్ గా కనిపించాడు. ఈ సినిమా కూడా తుస్సుమంది. అయితే నటుడిగా తారకరత్న ఓకే అనిపించుకొన్నాడు. ఇంకాస్త సానబెడితే, తారకరత్న నుంచి ఇంకాస్త మంచి నటుడ్ని బయటకు తీసుకురావొచ్చన్న నమ్మకం కలిగించాడు. అందుకే ఇప్పుడు అతని ముందు మరో బంపర్ ఆఫర్ వచ్చింది.
సాయిధరమ్ తేజ్ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ చిత్రం ఇటీవలే క్లాప్ కొట్టుకొంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇందులో ప్రతినాయకుడిగా తారకరత్నని ఎంచుకొనే ప్రయత్నంలో ఉంది చిత్రబృందం. నిజంగా ఇది తారక్‌ని ఊహించని అవకాశమే. అయితే గోపీచంద్ మలినేని మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ”విలన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి కొత్త విలన్నిచూస్తారు. తారకరత్నకి ఇంకా కథ చెప్పలేదు” అంటున్నాడాయన. నిజంగానే మెగా హీరోతో నందమూరి హీరో ఢీ కొడితే.. ఫ్యాన్స్ కి చూడముచ్చటగానే ఉంటుంది.