మంత్రి వెల్లంపల్లి టార్గెట్గా వైసీపీలో జోరు రాజకీయం జరుగుతోందన్న సమాచారం… బెజవాడలో గుప్పుమంటోంది. ఆయన అవినీతిని అడ్డంగా పట్టుకునేందుకు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు దుర్గగుడిపై ఫోకస్ పెట్టారని… అందుకే ఒక సారిఏసీబీ.. మరోసారి విజిలెన్స్ తో దాడులు చేయించి.. మొత్తం గుట్టు రట్టు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. ఇందులో ఈవో లంచాల గుట్టు మొత్తం ఉంది. అమ్మవారి ప్రసాదం సరుకులు దగ్గర్నుంచి దుకాణాలఅద్దె వరకూ ఎక్కడ చూసినా అవినీతేనని ఏసీబీ, విజిలెన్స్ తేల్చేేశారు. నిజానికి ఏసీబీ దాడులు చేసినప్పుడు.. ఈవోనే పెద్ద మనిషి తరహాలో ముందుకు వచ్చి పదిహేను మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు.
కానీ అసలు సూత్రధారి ఆయనేనని అందరికీ తెలిసినా ఎవరూ ఆయన జోలికి వెళ్లలేదు. ట్రాన్స్ఫర్ చేశారని లీక్ చేశారు కానీ అదీ కూడా లేదు. తాజాగా విజిలెన్స్ రంగంలోకి దిగింది. అన్ని రకాల ఉల్లంఘనలను రిపోర్టుగా రెడీప్రభుత్వానికి సమర్పించింది. ఈవో సురేష్ బాబు ఇప్పుడు పీకల్లోతులో మునిగిపోయారు. అయితే ఆయన మాత్రం ధీమాగా ఉన్నారు. ఎందుకంటే… ఈవో సురేష్ బాబు డొంక కదిలిస్తే.. బయటపడేది మంత్రి వెల్లంపల్లి లీలలేనని ఆయన ధీమా అని వైసీపీలో చర్చ జరుగుతోంది.
వెల్లంపల్లి… ఈవో సురేష్ బాబును కాపాడటానికి స్వరూపానంద సాయం తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వెల్లంపల్లిని కాపాడే ఉద్దేశం ఉంటే.. విజిలెన్స్ సోదాలు చేయరని.. ఆయనను ఫిక్స్ చేయడానికే.. సోదాలు చేశారని.. ఓ బ లమైన అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు వెల్లంపల్లికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అవినీతి చేసి అడ్డంగా దొరికిన ఈవోను బదిలీతో సరి పెడితే.. వెల్లంపల్లి పలుకుబడి పని చేసినట్లే.. అరెస్టుల్లాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే.. వెల్లంపల్లికి కూడా రాజకీయంగా అలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.