ఉగ్రవాదం అన్ని దేశాలకి వ్యాపిస్తున్న కొద్దీ నిత్యం ఎక్కడో ఒకచోట దానికి ప్రజలు బలైపోతూనే ఉన్నారు. మొన్న ఇస్తాన్ బుల్, నిన్న డాకా.. పాతబస్తీలో ఉగ్రవాదులని ఎన్.ఐ.ఏ. సకాలంలో కనిపెట్టలేకపోయుంటే ఈ శని ఆదివారాలలో హైదరాబాద్ లో బాంబులు ప్రేలి మరెందరో బలైపోయుండేవారు. దీనిని ఎప్పటికైనా అరికట్టడం సాధ్యమో కాదో తెలియదు. కానీ నిత్యం ఉగ్రవాదుల చేతిలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
డాకాలో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం 20మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారత్ కి చెందిన తరిషి జైన్ కూడా ఒకరు. ఆమె వయసు కేవలం 18ఏళ్ళు…ఇంకా జీవిత ప్రయాణం ప్రారంభంలోనే ఉంది. ఇంతలోనే ఉగ్రవాదుల చేతిలో చిక్కి దారుణంగా హత్య చేయబడింది. ఆమె యుసి బెర్కిలీ విద్యార్ధి. ఆమె తండ్రి గత రెండు దశాబ్దాలుగా డాకాలో బట్టల వ్యాపారం చేస్తున్నారు. శలవులలో తల్లితండ్రులతో హాయిగా గడపడానికని ఆమె అక్కడికి వచ్చింది. ఆమె ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించి లోపల ఉన్నవారిని బందీలుగా పట్టుకొని అతికిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపారు. తరిషి జైన్ కూడా వారి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఆరుగురు ఉగ్రవాదుని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఒకరిని సజీవంగా పట్టుకోగలిగాయి. కానీ పోయిన ప్రాణాలు ఎవరూ తెసుకు రాలేరు. చనిపోయినవారి కుటుంబాల ఆవేదన ఎన్నటికీ తీరేది కాదు. అలాగే ఈ ఉగ్రవాదం కూడా ఇంతటితో ఆగేది కాదు.
ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్, టర్కీ దేశాలు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వలన అవి ఎంత మూల్యం చెల్లించాయో అందరూ కళ్ళారా చూశారు. ఇప్పటికైనా అన్ని దేశాలు మేల్కొని ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించేందుకు కలిసికట్టుగా కృషి చేయకపోతే ఇటువంటి దారుణాలు లెక్కపెట్టుకొంటూ భయం భయంగా బ్రతకాల్సిందే!