పెళ్లిచూపులు సినిమాతో తెలుగు పరిశ్రమకు కొత్త జీవం పోశాడు తరుణ్ భాస్కర్. చిన్న సినిమాగా విడుదలై.. సంచలనం సృష్టించింది పెళ్లిచూపులు. నవతరం దర్శకులకు ఓ మార్గం చూపిస్తూ నిర్మాతలకు ధైర్యం ఇచ్చింది. ఈ సినిమాలో లాభాలు చవిచూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.. తరుణ్‌కి మరో అవకాశం ఇచ్చింది. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’లో మాత్రం తరుణ్ మార్క్ కనిపించలేదు. ఆ సినిమా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయిందంతే. ఆ తరవాత తరుణ్ ఎలాంటి సినిమా చేస్తాడు?? అవకాశం ఎవరిస్తారు? అన్నట్టు టాలీవుడ్ ఎదురుచూసింది. అయితే సురేష్ ప్రొడక్షన్స్ ఈ యువ దర్శకుడిపై పూర్తి భరోసా ఉంచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ప్రాజెక్టులు అప్పగించింది.
అవును.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరో మూడు సినిమాల్ని చేయనున్నాడు. ఓ కథ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మరో సినిమాకి తాను దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాణంలోనూ పాలుపంచుకోబోతున్నాడు. అయితే ఇందులో నటించే నటీనటులు ఎవరన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది. ”ప్రస్తుతం వాటి గురించే కసరత్తు జరుగుతోంది. కథని బట్టే తారల్ని ఎంపిక చేస్తాం” అని సురేష్ బాబు ప్రకటించారు.