పెళ్లి చూపులు హిట్‌తో.. అందరి దృష్టినీ ఆకర్షించాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమాతో టాలీవుడ్లో మరో కొత్త ఒరవడి మొదలైనట్టయ్యింది. న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీలకు ఈ సినిమాతో తలుపు తీశాడు తరుణ్ భాస్కర్. తాను అనుకుంటే, వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటే తప్పకుండా తన రెండో సినిమాని ఓ స్టార్ హీరోతోనే పట్టాలెక్కించేవాడు. కానీ అలా చేయలేదు. తన స్కూల్ లోనే, మళ్లీ కొత్తవాళ్లతో ఓ ప్రయోగం చేశాడు. ఆ సినిమాలో ఒక్కటీ తెలిసిన మొహం లేదు. ఆఖరికి ప్రియదర్శిని ని కూడా రిపీట్ చేయలేదు. ఓ విధంగా ఇది రిస్కే. ‘నగరానికి ఏమైంది’ అనే టైటిల్.. సురేష్ బాబు, తరుణ్ భాస్కర్ల పేర్లు.. తప్పకుండా ఆకర్షించేవే. కాకపోతే… ‘స్టార్’ క్యాటగిరీలో చేరడానికి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా జారవిడుచుకున్నాడు. ఒకవేళ… `నగరానికి ఏమైంది` సినిమా అటూ ఇటూ అయితే…. తరుణ్ భాస్కర్ చాలా పెద్ద తప్పు చేసినవాడవుతాడు. కాకపోతే… ఈ ఎత్తుగడ కూడా తెలివైనదే అనిపిస్తుంది.
కొత్త వాళ్లతో ఓ ప్రయోగం చేసి, హిట్టు కొట్టి, స్టార్ హీరోతో సినిమా చేసే జాక్ పాక్ కొట్టిన కొంతమంది దర్శకులు ద్వితీయార్థంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. తొలి సినిమా హిట్ తో పెరిగిన అంచనాల్ని ఏమాత్రం అందుకోలేక విఫలమయ్యారు. దాంతో వాళ్లంతా వన్ సినిమా వండర్గానే మిగిలిపోయారు. మళ్లీ చిన్నా చితకా సినిమాలు చేయలేక, స్టార్లు దొరక్క… మధ్యస్థంగా మిగిలిపోయారు. ఆ అనుభవాలన్నీ తరుణ్‌ని భయపెట్టి ఉంటాయి. అందుకే తన దారిలోనే ఓ చిన్న సినిమా తీసుకున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతానికైతే భారీ అంచనాలు లేవు. పెళ్లి చూపుల్ని ఎలా ఖాళీ బుర్రతో చూశారో, దీన్నీ అలానే చూసే ఛాన్సుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించినా – తరుణ్ మరోసారి పాస్ అయిపోతాడు. తన ప్లాన్ వర్కవుట్ అయితే… ఈసారి మరికొంత మంది పెద్ద హీరోలు తరుణ్ కోసం క్యూ కడతారు. ఈసారి ఆప్షన్లు పెరుగుతాయి. ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వాళ్లు దొరకే ఛాన్సులు ఎక్కువవుతాయి. తరుణ్ ప్లాన్ కూడా ఇదే కావొచ్చు.