ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో… ఆయన చేరిక తర్వాత ఎలా వ్యవహరించాలన్నది ఇప్పుడు బీజేపీకి పెద్ద టాస్క్‌గా మారింది. ఈటల రాజేందర్ 14వ తేదీన ఢిల్లీలో నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ విషయం ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా… పరిస్థితి తేడా వచ్చేస్తుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ .. తరుణ్ చుగ్ ..ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో టీఆర్ఎస్తో ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు.
తనకు కష్టమెచ్చిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ బీజేపీతో స్నేహం ఉన్నట్లు నటిస్తున్నారని బీజేపీ నేతలు విశ్లేషించారు. ఇక నుంచి కేసీఆర్ ట్రాప్‌లో పడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై ప్రజల్లో ఉన్న అపోహలను వీలైనంత త్వరగా తొలగించాలని తరుణ్ చుగ్ పార్టీ నేతల్ని ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాల్సిందిగా జాతీయ నాయకత్వాన్ని కోరాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. విచారణ జరిపితేనే బీజేపీపై ఉన్న అపోహలు ఈజీగా పోతాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది.
అందుకే ఇటీవలి కాలంలో … బండి సంజయ్ పదే పదే విచారణ గురించి చెబుతున్నారు. ఈటలను పార్టీలో చేర్చుకున్న తర్వాత టీఆర్ఎస్పై తృణమూల్‌పై దాడి చేసినట్లుగా చేయకపోతే…పార్టీని ఇతర నేతలు నమ్మరని చెబుతున్నారు. అందుకే… పధ్నాలుగో తేదీన ఈటల పార్టీలో చేరిన తరవాత.. అసలు రాజకీయం ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.