ఎపి తెలంగాణ విభజన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానిని కోరడం బాగా ఆలస్యమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.9,10 షెడ్యూళ్లలోని సంస్థల విషయం ఇప్పటికీ తేలలేదని ఆయన అంటున్నారు. వాస్తవానికి సీనియర్ నాయకుడైనా చంద్రబాబు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వుండటమంటే దాని ప్రభావం ఎలా వుంటుందో అంచనా వేసుకోలేకపోయారు. తనకున్న అనుభవంతో పూర్వ వైభవం పునరుద్ధరించుకోగలనని భావించారు. పదేళ్లు ఇక్కడే వుంటానని ప్రకటించారుకూడా. కేంద్రం కూడా తన మాటకు విలువనిస్తుందని విభజన చట్టం అమలు చేస్తుందని ఆశపడ్డారు. పైగా ఈ రెండు షెడ్యూళ్లలోని ప్రభుత్వ సంస్థలపై పెద్ద ఆసక్తి కూడా లేకపోయింది.అందులో కొన్ని తప్ప మిగిలినవి దండగమారి భారమే అనుకుని అలక్ష్యం చేశారు. ఈలోగా అశనిపాతంలా ఓటుకు నోటు కేసు రావడంతో అంతా తలకిందులైంది. తనకే భద్రత గోప్యత లేదని భావించి హుటాహుటిన తరలిపోయారు. తర్వాత టిఆర్ఎస్ హైదరాబాద్ కార్పొరేషన్‌ను, టిడిపి ఎంఎల్ఎలను కూడా వూడ్చిపారేయడంతో ఒక ఘట్టం ముగిసింది. ఆ దశలో కొంత సయోధ్య కోసం ప్రయత్నం జరిగినా సమూల పరిష్కారాల వరకూ చర్చలు వెళ్లలేదు. చెప్పాలంటే అమరావతి పోలవరం రెండే పట్టుకున్న ముఖ్యమంత్రి విభజన సమస్యలను కూడా త్వరితంగా పరిష్కరించుకోవాలిన గుర్తించలేదు. ఆ రోజుల్లో నేనే చాలాసార్లు టిడిపి మంత్రులతో ప్రభుత్వ సలహాదార్లతో ఈ విషయం అంటే నిజమేనని ఒప్పుకునేవారు. కాని ఆయనకు ఆ ప్రాధాన్యత లేదు గనక మార్పు రాలేదు.ఇప్పుడు అన్ని పాలక పార్టీలు ఏ రాష్ట్రంలో చెప్పేది అక్కడ చెప్పి ఓట్లు పొందే ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. కనుక టాస్క్‌ఫోర్స్ వేయడం వేసినా ఖచ్చితమైన ముగింపు ఇవ్వడం జరిగేది కాదు. ఆ దశ దాటిపోయింది.