దక్షిణాదిలో టాటాలు సెమీ కండక్టర్స్ యూనిట్ పెట్టాలని నిర్ణయించారు. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో నెంబర్ వన్‌గా ఉన్న టీసీఎస్‌కు తోడుగా హార్డ్ వేర్ విషయంలోనూ రాణించాలని అనుకుంటున్నారు. అందుకే రూ. 2200 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించారు. దీనికి దక్షిణాది అనువుగా ఉంటుందని భావించి మూడు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ, కర్ణాటక , తమిళనాడులతో చర్చలు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, పరిస్థితులను బట్టి టాటాలు వచ్చే నెలలో నిర్ణయం ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరిశ్రమ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. చేసినట్లుగా కూడా స్పష్టత లేదు. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రానికి టాటాలు చేయూతనందించడానికి సిద్ధంగా ఉంటారు. విశాఖ, అనంతపురం, విజయవాడ వంటి చోట్ల ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలుగా ఉంటాయి. అనంతపురం బెంగళూరుకు సమీపంలో ఉంటుంది. ఇలాంటి అడ్వాంటేజ్‌ను వాడుకుని టాటాలకు ప్రతిపాదనలు పంపి.. మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి పరిశ్రమను రాబడితే.. యువతకు ఎంతో మేలు జరుగుతుంది. టాటాల పరిశ్రమ వస్తే ఒక్క పరిశ్రమతో ఆగిపోతే అలాంటి పరిశ్రమలు.. అనుబంధ పరిశ్రమలు చాలా వస్తాయి. వాటి వల్ల రాష్ట్రానికి మేలు. కానీ అంత దీర్ఘంగా ఆలోచించే నాయకులు ప్రస్తుతం లేరు.
టాటాలకు ఏపీ అంటే అభిమానం ఉంది. టాటా ట్రస్ట్ మొత్తం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ పర్యటనకు కూడా టాటా వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. ఎలాగైనా ఆ పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేవారు. టాటాలకు ఆ ఆలోచన ఉన్నప్పుడే ఆయన రంగంలోకి దిగేవారు. ఇప్పుడు ఏపీకి పరిశ్రమ కోసం పోటీ పడే తీరిక లేదు.