ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం.. వేతన జీవుల్ని నిలువుగా దోపిడీ చేయడం తప్ప. మధ్యతరగతి ప్రజల్ని దోచి ఓటు బ్యాంకులకు పంచడం తప్ప. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో .. వేతన జీవుల్ని మరింత పిండుకునే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి ప్రజలకు కనీస రిలీఫ్ ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు.
ఓ ఉద్యోగి సంపాదించిన దానికి పన్ను కట్టాలి. ఆ పన్ను కట్టిన మొత్తంతో ఏదైనా కొనుక్కున్నా పన్ను కట్టాలి. అలా కొన్న దానికి డబుల్ టాక్సులు కూడా ఒక్కోసారి కట్టొచ్చు. పన్నుల్లో పెట్రో దోపిడీ వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే… ఆదాయంలో సగం ప్రభుత్వానికే కట్టాల్సింది వేతన జీవి. ఈ రోజుల్లో కనీసం యాభై వేల జీతం లేనిదే కుటుంబం గడవదు. అంటే ఆరు లక్షలు. ఇది ఓకుటుంబం గడవడానికి అయ్యే కనీస మొత్తం. ఇంత సంపాదించుకున్నా సరే ఆదాయపు పన్ను కట్టాల్సిందే. మూడు లక్షలకు మించి సంపాదిస్తే పన్ను పరిధిలోకి తెచ్చేశారు.
Also Read : కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే
పదేళ్ల కిందట ద్రవ్యోల్బణం ఎంత.. ? ఇప్పుడు ఎంత ?. పదేళ్ల కిందట.. ఓ కుటుంబానికి నెలకు అసరమైన నిత్యవసర వస్తువుల బడ్జెట్ రూ. ఐదు వేలు అయ్యేది. ఇప్పుడు పదిహేను వేలు అవుతోంది. ఇంటి అద్దెల గురించి చెప్పాల్సిన పని లేదు. రెట్టింపు ను ఎప్పుడో దాటిపోయాయి. పెట్రోలు.. స్కూల్ ఫీజులు ఇలా అన్నీ ఖర్చులే. అన్నింటిలోనూ పన్నులు కడతాడు వేరేవిషయం. అయినా ఆదాయపు పన్ను మినహాయింపు మాత్రం పెద్దగా పెరగలేదు. పదేళ్ల కిందట యూపీఏ హయాంలో చిదంబరం రెండున్నర లక్షల వరకూ పన్ను మినహాయింపు చేశారు. ఇప్పుడు అతి కష్టం మీదా దాన్ని మూడు లక్షలు మాత్రమే చేశారు. కనీసం పది లక్షల ఆదాయం వరకైనా రిలీఫ్ ఉండాలన్నది అందరి అభిప్రాయం. ఎందుకతంటే సంపాదించే దాంట్లో ప్రభుత్వమే సగం తీసుకుంటే సామాన్యుడు ఎలా బతుకుతాడు ?
పన్ను పరిధిలోకి వస్తే మధ్య తరగతి జీవికి ప్రభుత్వ సహకారమే ఉండదు. విద్య, వైద్యం ఎప్పుడో ప్రజలకు దూరమయ్యాయి. కనీసం రోడ్లు కూడా సరిగ్గా ఉండటం లేదు. పైగా దేశంలో పన్ను కట్టేవారు 2.2 శాతం కూడా లేరంటూ కబుర్లు చెబుతూ ఉంటారు. నిజానికి దేశంలో అడుక్కునే వాడిదగ్గర కూడా పన్ను కట్టించుకుంటున్నారు. ఆ 2.2 శాతాన్ని ప్రభుత్వాలు నిలువు దోపిడీ చేస్తున్నాయన్నమాట.