తెలంగాణ ప్రభుత్వం… ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో… అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహకాలు ప్రకటించాలని నిర్ణయంచారు. తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చాలని కేటీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
తెలంగాణలోనే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. ద్విచక్ర వాహనంపై కనీసం రూ. పదివేలు లాభం కలిగేలా ఓ విధానాన్ని సిద్ధం చేశారు. తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20వేల ఆటోలు, మొదటి 5వేల కార్లు, 10వేల తేలికపాటి రవాణా వాహనాలు., 500 ఎలక్ట్రిక్ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు ఇస్తారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం పూర్తిగా తీసేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు కూడా చేపట్టనున్నారు. ముందు చూపుతో.. అవకాశాల్ని అంది పుచ్చుకోవడంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ లాంటి మెట్రో నగరం ఉండటం… కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్న సమయంలో ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వైపు మొగ్గుతోంది. దిగ్గజ ఆటోమోబైల్ సంస్థలన్నీ.. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. తెలంగాణలో డిమాండ్ పెంచితే..ఆటోమేటిక్‌గా పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది.