ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో సమాంతర వెబ్ సైట్ క్రియేట్ చేసి మరీ వందల కోట్లు దోచుకున్న వ్యవహారం సంచలనం రేపుతోంది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఇదంతా మామూలే కదా అన్నట్లుగా లైట్ తీసుకున్న విషయం అధికారవర్గాల్లోనూ సంచలనం అవుతోంది. కొంత మంది అధికారులు, వారి వెనుక ఒక ప్రజాప్రతినిధి, కలిసి రాష్ట్ర ఖజానాకు రావాల్సిన వందల కోట్లు నొక్కేస్తున్నారనే విషయం బయటపడింది.
జీఎస్టీ వచ్చాక వ్యాట్ నిలిపివేశారు. 2017 జూన్‌తో ముగిసిన ‘వ్యాట్’ కింద వేసిన పన్నులపై ఆరేళ్లపాటు రివ్యూలు జరిపే అవకాశముంది. కేవలం ఈ రివ్యూలు, ‘అప్పిలేట్’ మాయలో… మూడేళ్లలో వివిధ రూపాల్లో కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ‘వ్యాట్ నుంచి మినహాయింపు’ అనే ఒకేఒక్క అంశం ఆధారంగా కోట్లు నొక్కేస్తున్నట్లు చెబుతున్నారు. వ్యాట్ చెల్లించాలని డిమాండ్ నోటీసులు వాణిజ్య పన్నుల శాఖ పంపినప్పుడు. ‘వ్యాట్’ చట్టం కింద తమకు ఇచ్చిన నోటీసులో అధిక పన్ను చూపారని, దీని పునఃపరిశీలించాలని వ్యాపారులు కోరవచ్చు. అయితే… ఇలా అప్పీలు చేయాలంటే నోటీసు ఇచ్చిన పన్నులో 12.5 శాతం ఫీజుగా చెల్లించాలి. అక్కడ వారికి అనుకూలమైన ఆదేశాలు రాకపోతే… మరో అప్పీలుకు వెళ్లవచ్చు. అప్పుడు పన్ను మొత్తంలో 25 శాతం చెల్లించాలి. ఈ చెల్లింపుల దగ్గరే గోల్మాల్ జరుగుతోందని చెబుతున్నారు.
పన్ను నోటీసును నిబంధనల ప్రకారం పరిశీలించకుండానే ఒక అధికారి ‘స్టే’ ఇస్తున్నారు. అంటే, ఆ పన్ను వసూలు కాదు. ‘అప్పీలు’ కోసం కట్టాల్సిన పన్ను వాటా కట్టాల్సిన అవసరమూ లేదు. అంతే… అది అంతటితో ఆగిపోతుంది. ఇలా అడ్డగోలుగా ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులవల్ల గత రెండేళ్లలో 220 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు ఆగిపోయాయిని చెబుతున్నారు. దీనికి గాను ఆ వ్యాపారుల దగ్గర నుంచివసూళ్లు చేశారని ంటున్నారు. ఈ బాగోతం బయటపడకుండా ఉండేందుకు వాణిజ్యపన్నుల శాఖ వెబ్సైట్ నుంచి ఆ ఉత్తర్వులను తాజాగా తొలగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి అడ్డగోలుగా గండి పడుతున్నట్లుగా కనిపిస్తున్నా… ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కొసమెరుపేమిటంటే.. వాణిజ్య పన్నుల శాఖలో అస్మదీయుడినే కూర్చోబెట్టారు. అక్కడే అసలు లాజిక్ ఉందని చెబుతున్నారు.