పెట్రో ధరలు ఎంత పెంచుతున్నా ప్రజల్లో స్పందన లేదని కేంద్రం.. అడ్వాంటేజ్‌గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీగా వడ్డిస్తోంది. లాక్ డౌన్ తర్వాత లీటర్ పెట్రోల్ ధర రూ. పాతిక రూపాయలకుపైగా పెంచారు. ఆత్ననిర్భర్ పేరుతో అమలు చేసిన ప్యాకేజీలకు నిధులు పెట్రో ధరల వడ్డింపు ద్వారానే పొందినట్లుగా కేంద్రం చెబుతోంది. అయితే ఆ వడ్డింపు అంతటితో ఆపలేదు. రోజుకు పావలా చొప్పున కొనసాగిస్తూనే ఉన్నారు. బడ్జెట్లో టాక్స్‌లు తగ్గిస్తారన్న ప్రచారం చేశారు. కానీ అదనపు వడ్డింపులు చేశారు. అయితే ఒక్క సారిగా నాలుగైదు రూపాయలు పెంచితే.. ప్రజలు ఊరుకోరని అనుకున్నారేమో కానీ ఎక్సైజ్ ట్యాక్స్ ను తగ్గించి…. సెస్ రూపంలో కవర్ చేశారు. కానీ ఆ నాలుగైదు రూపాయల పెంపును… బడ్జెట్ అమల్లోకి వచ్చే సరికి.. .కవర్ చేసేస్తున్నారు.
ప్రభుత్వం తీరు సామాన్యుల జీవితాలపై దారుణంగా ప్రభావం చూపిస్తోంది. ఇతర వాటిపై పన్నులు పెంచితే ఆ ఒక్క రంగంపై ప్రభావం పడుతుందేమో కానీ… పెట్రోల్ , డీజీల్ రేట్లు పెంచితే నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. అలా పెరిగితే.. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో వసూలు అవుతున్న జీఎస్టీ గణాంకాలే ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం చితికిపోతున్నారన్న కనీస స్పృహ కేంద్రానికి ఉండటం లేదు. కరోనా కారణంగా ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయం పడిపోయింది. ఈ విషయం తెలిసి కూడా కేంద్రం పన్నుల బాదుడును ఆపడం లేదు. ప్రజలు కూడా.. టైం తీసుకుని రోడ్లెక్కే అంత ఆలోచన చేయడం లేదు.
ఇదే కేంద్ర ప్రభుత్వానికి అలుసైనట్లుగా కనిపిస్తోంది. చివరికి వంట గ్యాస్ పైనా.. ఓ రేంజ్ లో వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు సబ్సిడీని నగదు బదిలీ అని చెప్పారు… కానీ ఇప్పుడు… కనీసం ఆ సబ్సిడీ యాభై రూపాయలు కూడా రావడం లేదు. కానీసిలిండర్ మాత్రం ఎనిమిది వందలు దాటిపోయింది. అంటే.. గ్యాస్ సిలిండర్ ధర రూ. ఏడు వందలకుపైగానే ఉంది. ఆరేళ్ల కిందట.. ఈ గ్యాస్ బండ ధర .. రూ. మూడువందలకు అటూ ఇటూగానే ఉండేది.