ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. ఇంత వరకూ ఎవరూ ఊహించని కొత్త కొత్త రూపాల్లో ప్రజల వద్ద నుంచి ఆదాయాన్ని పిండుకోవాలనుకుంటోంది. కొండంత అప్పులు చేస్తున్నా.. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండటం లేదు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించలేకపోతోంది. దీంతో ఆ సొమ్మును ప్రజల వద్ద నుంచే లాగాలని నిర్ణయించుకుంది. రెండు రకాల పన్నుల వడ్డనకు సిద్ధం చేసింది. అందులో ఒకటి .. ఏపీలో డబుల్ లైన్ రోడ్లన్నింటికీ టోల్ వసూలు చేయడం.. రెండోది ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్న వసూలు చేయడం.
ప్రస్తుతం జాతీయ రహదారులకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఏపీలో రాష్ట్ర రహదారులకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. డబుల్ లైన్ ఉన్న ప్రతీ రోడ్డుకి టోల్ పెట్టాలని డిసైడయ్యారు. ప్రతి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకూ ఓ టోల్ గేట్ ఉంటుంది. ప్రజల పన్నులతో కట్టే రోడ్లను .. వాహనాలు కొనేటప్పుడు.. లైఫ్ ట్యాక్స్‌లు కట్టి మరీ రోడ్లను ఉపయోగించుకోవడానికి మరోసారి టోల్ టాక్స్‌లు కట్టాల్సిన పరిస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడబోతోంది రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నప్పటికీ… ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ప్రజల టోల్ తీయాలనే నిర్ణయించుకుంది. ఈ టోల్ ద్విచక్ర వాహనలకూ కూడా పెడతారేమో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక ఆస్తి పన్ను విధింపు విషయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. అదేమిటంటే… ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తారన్నమాట. ఎప్పుడో 30 ఏళ్ల కిందట…3 లక్షలు పెట్టి ఇల్లు కొంటే.. ఇప్పుడు అది 3 కోట్లు అవ్వొచ్చు. ఇప్పుడు రూ. 3 కోట్ల ఆస్తికి కాబట్టి.. ఏడాదికి రూ. 30వేల టాక్స్ విధించొచ్చు..! రూ. 30వేలే ఉండాలనేం లేదు.. ప్రభుత్వం ఎంత ఆదాయం పొందాలనుకుంటే అంత నిర్ణయిస్తుంది. అయితే నిర్ణయం తీసుకున్నారు కానీ అమలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే చేస్తారు. ఆ విషయం కూడా ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.
మొత్తానికి ఏపీ ప్రజలు పన్నుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం అందించే పథకాల ద్వారా ఎంత మంది ప్రజలు.. ఎన్ని విధాలుగా లబ్దిపొందుతున్నారో స్పష్టత లేదు కానీ.. ప్రజలందరి దగ్గర టోకుగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఏ పథకాలూ అందని మధ్య తరగతి జీవి.. అటు ఉచిత పథకాల కోసం.. తమ డబ్బునే త్యాగం చేయాల్సి వస్తోంది.