తెలుగు360 రేటింగ్: 2.75/5
మనకు తెలిసింది సైన్స్..తెలుసుకోవాలనుకుంటున్నది కూడా సైన్సే..
మరి..మనకు తెలియంది? అసలు తెలిసే అవకాశం లేదనిపించేవి?
వాటికి మనిషి పెట్టుకున్న పేరు నిగూఢమైన రహస్యాలు…అతీయ శక్తులు..
నిజంగా మావవాతీత శక్తులున్నాయా? అవి మనోఛక్షువులు కల్పించే అభూత కల్పనలేనా?
ఈ ప్రశ్నల్ని మనిషి ఆనాదిగా అన్వేషిస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఇలాంటి మిస్టరీ కథాంశాలు ఆవిష్రృతమవుతూనే ఉన్నాయి. అయితే సూపర్‌నేచురల్ కాన్సెప్ట్‌లు, దెయ్యం కథాంశాలు అనగానే ఎక్కువగా సస్పెన్స్ క్రియేట్ చేయడం, ప్రేక్షకుల్ని భయపెట్టే ప్రయత్నమే జరుగుతుంటుంది. కానీ ‘టాక్సీవాలా’లో అందుకు భిన్నంగా పారా సైకాలజీలోని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే ఓ పాయింట్‌ను కథావస్తువును ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది. ‘నోటా’ రూపంలో విజయ్ దేవరకొండ ఓ చిన్న స్పీడ్‌బ్రేకర్‌ను ఎదుర్కొన్నాడు. కానీ ఆయన వేగానికి మాత్రం బ్రేకులు పడలేదు. టాక్సీవాలా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పైరసీ వివాదాల వల్ల ఈ సినిమాపై ఎవరూ పెద్దగా అంచనాల్ని పెట్టుకోలేదు. అయితే విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై నమ్మకం సినిమా విజయంపై ఆశల్ని సజీవంగా ఉంచింది. ఈ నేపథ్యంలో పెద్ద అంచనాలు లేకుండా టాక్సీవాలా రైడ్‌కు సిద్ధమయ్యాడు..మరి అతని ప్రయాణంలో మలుపులు ఏమిటో? అంతిమ గమ్యం ఏమిటో? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
* కథ
శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లు చదివి డిగ్రీ పాసవుతాడు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసినా..వేటిలో ఇమడలేకపోతాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించవొచ్చనే ప్రకటన చూసి ఎక్సైట్ అవుతాడు. అన్నావదిన దగ్గర డబ్బులు తీసుకొని తక్కువ ధరకు వస్తుంది కదా అని రఘురామ్ (సిజ్జు మీనన్) అనే వ్యక్తి వద్ద వింటేజ్ కారును ఖరీదు చేస్తాడు. తన అభిరుచికి తగినట్లుగా దానిని అందంగా ముస్తాబు చేసుకుంటాడు. ఈలోగా క్యాబ్ ప్రయాణంలో పరిచయమైన డాక్టర్ అను (ప్రియాంక జవాల్కర్) ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో కారులో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతున్నట్లు తెలిసుకుంటాడు శివ. ఏవో అతీయ శక్తులు కారును ఆవహించాయని అతనికి అర్థమవుతుంది. తిరిగి కారును యజయాని రఘురామ్కే అప్పజెబుతామనుకుంటాడు. ఈ క్రమంలో రఘురామ్ ఇంటిలో బందీగా ఉన్న సైకాలజీ ప్రొఫెసర్ రవివర్మను కలుసుకుంటాడు శివ. ఆయన ద్వారా ఆ కారు గురించిన భయంకర నిజాల్ని తెలుసుకుంటాడు? అసలు రఘురామ్ ఎవరు? రఘురామ్‌కు శిశిర (మాళవిక నాయర్)కు ఉన్న సంబంధం ఏమిటి? ప్రొఫెసర్ రవివర్మ చేసిన ప్రయోగం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? చివరకు శివ తన కారులోని అతీత శక్తుల్ని ఎలా వదిలించుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా చిత్ర కథ.
* విశ్లేషణ..
హీరో ఓ ఇంట్లో ప్రవేశించడం, అందులో ఓ దెయ్యం ఉండడం, హీరోనీ, అతని గ్యాంగ్‌నీ దెయ్యం ఓ ఆటాడుకోవడం – ఇంతసేపూ ఇలాంటి కథలే చూశాం. అవే విజయాలు అందించాయి. అవే బోర్ కొట్టించాయి. వాటితో పోలిస్తే.. టాక్సీవాలా కథ, కథనాలు భిన్నంగా అనిపిస్తాయి. ఈ సినిమాకు ఆయువుపట్టు అయిన ఆస్ట్రాల్ ప్రొజక్షన్ అనే పాయింట్ కొత్తగా ఉంది. పారానార్మల్ సైకలాజీలోని ఈ అంశాన్ని తీసుకొని దాని చుట్టూ కథను అల్లుకున్నాడు దర్శకుడు. ఇంతకి ఆస్ట్రాల్ ప్రొజక్షన్ అంటే ఏమిటి? ఈ సినిమా కథలో అందించిన సమాచారం ప్రకారం..కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ మనిషి శరీరం నుంచి ఆత్మను తాత్కాలికంగా వేరు చేయవచ్చు. అలా వేరైన ఆత్మ ఇదివరకే సంచరిస్తున్న ఆత్మలతో సంభాషించవొచ్చు. అంటే మనం కోల్పోయిన ప్రియమైన వారితో, ఆప్తులతో సబ్కాన్షియస్ మైండ్ ద్వారా సంభాషించవొచ్చన్నమాట. అయితే ఇందులోని హేతువు ఎలా ఉన్నా థియరిటికల్‌గా తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గరే ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ అయిపోతారు. ఆరంభంలో ఎక్కడా ఉత్కంఠభరితమైన ఎత్తుగడ లేకండా సాదాసీదాగా ఈ కథ ఆరంభమవుతుంది. కారులో దెయ్యముందని తెలుసున్న తర్వాత ఒక్కసారిగా కథాగమనంలో వేగం పెరుగుతుంది. డాక్టర్ అయిన ఉత్తేజ్ తన కారులో ప్రయాణిస్తూ అనూహ్యంగా హత్య చేయబడటంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. ఇక అక్కడి నుంచే కథలో సస్పెన్స్ ఆరంభమవుతుంది. రఘురామ్ ఇంటిలో బందీగా ఉన్న ప్రొఫెసర్ రవివర్మను శివ కలుసుకోవడంతో కథలోని ఆస్ట్రాల్ప్రొజక్షన్ అనే మెయిన్ పాయింట్ రివీల్ అవుతుంది. ప్రథమార్థంలో శివ..అతని స్నేహితులు మధునందన్, విష్ణు (సైన్మా షార్ట్‌ఫిల్మ్ ఫేమ్) మధ్య వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. డాక్టర్ అనుతో శివ పరిచయం, రొమాంటిక్ సన్నివేశాల్ని కూడా చక్కగా ఆవిష్కరించారు. ఇక ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రొఫెసర్
రవివర్మ…శిశిర మీద ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ ప్రయోగానికి సంబంధించిన ఎపిపోడ్ ఉత్కంఠను పంచింది. మార్చురీలో ఉన్న శిశిర బాడీని బయటకు తీసుకురావడానికి శివ చేసే ప్రయత్నాల నుంచి సినిమా మరింత సస్పెన్స్‌తో సాగింది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గరే టాక్సీవాలా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. అవి మరీ సినిమాటిక్‌గా, డ్రమెటిక్‌గా సాగాయి. శిశిర పాత్ర ద్వారా మానవీయ కోణాన్ని ఆవిష్కరించడం ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. కథ ఆద్యంతం సీరియస్ నోట్లో సాగుతున్నప్పటికీ వినోదం మాత్రం ఎక్కడా మిస్ కాలేదు. మధునందన్, విష్ణు, చమ్మక్ చంద్ర కామెడీ ట్రాక్ కడుపుబ్బా నవ్విస్తుంది. సైన్మా షార్ట్‌ఫిల్మ్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న విష్ణు ఈ సినిమాలో మంచి హాస్యాన్ని పండించాడు. అతని కామెడీ టైమింగ్, తెలంగాణస్లాంగ్ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మధునందన్ కూడా కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఆస్ట్రాల్ ప్రొజక్షన్ అనే కాన్సెప్ట్ మీద దర్శకుడు మంచి రీసెర్చి చేశాడనిపించింది. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ అనిపించకుండా సన్నివేశాల్ని అల్లుకున్న విధానం ఆకట్టుకుంటుంది. హ్యుమర్, ఎమోషన్స్, సస్పెన్స్ అంశాల్ని సమపాళ్లలో రంగరించడం ఈ సినిమాకు పెద్దబలం.
*నటీనటులు
మామూలు కథను తన స్క్రీన్‌ప్రజెన్స్ ద్వారా రక్తికట్టిస్తాడు విజయ్ దేవరకొండ. కథలో దమ్ముంటే ఇక అతని పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. శివ పాత్రలో విజయ్‌దేవరకొండ చక్కటి నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ ఘట్టాల్లో అతని ప్రతిభ పూర్తి స్థాయిలో బయటపడుతుంది. ఇక కథానాయిక ప్రియాంక జవాల్కర్ పాత్ర నిడివి చిన్నదే అయినా ఆమె నటన బాగుంది. శిశిరగా మాళవిక నాయర్ కీలకమైన పాత్రలో మెప్పించింది. ద్వితీయార్థంలో ఆమె పాత్ర చుట్టే కథ మొత్తం నడిచింది. మధునందన్, విష్ణు మంచి కామెడీని పండించారు. చమ్మక్ చంద్ర పాత్ర కూడా నవ్వుల్ని పంచింది. యమున, ఉత్తేజ్, సిజ్జు మీనన్ తమ పాత్రల పరిధుల మేరకు బాగానే నటించారు.
* సాంకేతిక వర్గం
సుజిత్‌సారంగ్ ఛాయాగ్రహణం కథలోని మూడ్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. జేక్స్బిజాయ్ సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఆత్మను ఆవిష్కరించేలా ఉంది. జీఏ2 పిక్చర్స్ , యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి..ఇక దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ కొత్త కథను ఎంచుకున్నాడు. చక్కటి వినోదం, హృద్యమైన సన్నివేశాలతో కథను అద్భుతంగా ఆవిష్కరించాడు.
* తీర్పు
కథలో నవ్యత, విజయ్ దేవరకొండ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ టాక్సీవాలాకు ప్రధానబలంగా నిలిచాయి. ఎలాంటి అంచనాలూ లేకుండా టాక్సీవాలా విడుదల అవ్వడం బాగా కలిసొచ్చింది. `నోటా` ఎఫెక్ట్‌తో తల్లడిల్లుతున్న విజయ్‌కి టాక్సీవాలా.. మంచి ఉపశమనం కలిగించిందనే చెప్పాలి.
* ఫినిషింగ్ టచ్: సాఫీ ప్రయాణం
తెలుగు360 రేటింగ్: 2.75/5