సింగరేణి బొగ్గుగనుల గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలలో టిఆర్ఎస్ అనుబంధమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టిబిజిఎస్కె) ఘన విజయమే సాధించింది.దాదాపు యాభై వేలమంది ఓటు చేయగా 4 వేల ఓట్ట మెజారిటితో గెలుపొందింది. ఇది మొత్తం ఓట్లలో 58 శాతం గనక ఇంతవరకూ ఓకె. అయితే ఈ విజయం కోసం టిఆర్ఎస్ నాయకత్వం, ప్రభుత్వంతో సహా చేసిన హడావుడి మోహరించిన నేతలు, వెచ్చించిన ఖర్చు వగైరాలతో పోల్చితే ప్రభంజనమేమీ కాదు. 12 జిల్లాలలో విస్తరించిన ఈ గనుల కార్మిక సంఘ ఎన్నికలను రాజకీయంగా మార్చడమే గాక స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం నుంచి మద్దతు పలికారు. అందుకోసం అనేక వరాలు ప్రకటించారు. ఇలా ఒక యూనియన్ కోసం ముఖ్యమంత్రులు మాట్లాడ్డం గతంలో ఎన్నడూ జరగలేదు. ఎంపి కవితతో సహా దాదాపు యాభై మంది ప్రజా ప్రతినిధులు అక్కడే మకాం వేశారు. మరో నంద్యాల అనే స్థాయిలో సర్వశక్తియుక్తులూ కేంద్రీకరించారు. ఇతర సంఘాల నుంచి ఫిరాయింపులను కూడా భారీఎత్తున నడిపించారు. మరోవైపున టిడిపి కాంగ్రెస్‌ల మద్దతుతో ఎఐటియుసి యూనియన్ ఢకొీన్నది. సిఐటియు, బిఎంఎస్‌లు విడిగా పోటీ చేశాయి.సింగరేణిలో ఎక్కువ కాలం ఎఐటియుసి, తర్వాత స్థానంలో ఐఎన్టియుసి గుర్తింపు పొందగా టిబిజిఎస్కె 2012 ఎన్నికలలోనే విజయం సాధించింది. ఆ రీత్యా అక్కడి సమస్యలకు మేము కారణం కాదని చెప్పే ప్రయత్నం కెసిఆర్‌తో సహా నాయకులందరూ చేసినా అధికారంలో వున్నారు గనక వారి బాధ్యత చాలా ఎక్కువగా వుంటుంది. వారసత్వ ఉద్యోగాలు అనే సమస్య చుట్టూనే ఎన్నికల పోరాటం సాగేలా చేయడంలో టిఆర్ఎస్ వ్యూహం పలించింది. రాజకీయ సమరంగా చేయడంతో ఆ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించారు. అయితే దాదాపు సగం మంది ఇంత హడావుడిలోనూ వ్యతిరేకంగా ఓటు చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఈ వ్యతిరేకత ఇంకా పెరగొచ్చు కూడా. అలాగే భవిష్యత్తులో తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ కలసి ఎన్నికల పోరాటం చేయొచ్చని సింగరేణి సూచిస్తున్నది. 2014 ఎన్నికలలోనూ ఈ పార్టీలు కలిసే వున్నాయి. టిడిపి వరకూ చూస్తే ఇది వరకే చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి వంటి ఒకరిద్దరే కాంగ్రెస్‌తో కలసి వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అత్యధికులు ఇందుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్తో వెళితేనే స్వామికార్యం స్వకార్యం నెరవేరతాయని లెక్క వేస్తున్నారు.