కేంద్రంలోని అధికార పార్టీతో తెరాసకు ఉన్నది ఎలాంటి అనుబంధమో అర్థం కాని విషయం! నిన్నమొన్నటి వరకూ ప్రధానమంత్రి మోడీ విధానాలకు పరిపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చారు కేసీఆర్. దీంతో రెండు పార్టీల మధ్యా స్నేహ పూర్వక వాతావరణమే ఉందనీ, భవిష్యత్తులో మైత్రీ బంధానికి పునాదులు పడ్డాయన్న వాతావరణం కొన్నాళ్లు కనిపించింది. ఎప్పుడైతే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయో.. అప్పటి నుంచీ భాజపా వ్యూహం మారిపోయింది. తెలంగాణలో కూడా సొంతంగా పార్టీని బలోపేతం చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. సో.. ఇకపై అధికార తెరాస పార్టీపై రాజకీయ పోరాటానికి తెర తీసింది.
నిజానికి, కేసీఆర్ సర్కారుపై రాజకీయ పోరాటం చేయాలంటే.. బలమైన పోరాటాంశం ఎవ్వరి దొరకడం లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఈ మధ్య కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే.. విమర్శలకు ఆస్కారం లేకుండా చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్ లో రకరకాల పథకాలు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్షాలేవీ పల్లెత్తి మాట్లాడలేకపోయాయి. తాజాగా… రైతులకు ఉచిత ఎరువు పంపిణీ అంటూ ఓ సంచలన నిర్ణయం ప్రకటించేశారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలకు స్పందించే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఇలాంటి అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయలేవు కదా! ఇలాంటి పరిస్థితుల్లో భాజపా పోరాటం ఎక్కడి నుంచి మొదలుపెడుతుందనే ప్రశ్నార్థకమే.
అయితే, ఎట్టకేలకు భాజపా ఒక అంశాన్ని ఎన్నుకుంది. అదేంటంటే.. ముస్లింలకు రిజర్వేషన్లు. ఈ బిల్లుపై భిన్నా భిప్రాయాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. సో.. దీన్ని తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. ఈ బిల్లు అసెంబ్లీకి వచ్చిన రోజు నుంచే పోరాటం చేయాలని భాజపా నిర్ణయించుకున్నట్టు సమాచారం. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై నిరసనగా అసెంబ్లీ ముట్టడితోపాటు, జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు భాజపా సిద్ధమౌతోంది. ఈ నెల 17న జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టాలని కమిటీ డిసైడ్ చేసింది.
సో… ఇకపై భాజపా తెరాసల మధ్య ఇంతవరకూ ఉన్న స్నేహపూరిత వాతావరణం మారబోతోందన్నది అర్థమౌతోంది. భాజపాలో లొల్లి పెట్టుకునేందుకు గతంలో తెరాస వెనకాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది తెరాస నాయకులు భాజపాపై విమర్శలు పెంచుతుంటే… ఓ సందర్భంలో కేటీఆర్ సయోధ్య కుదిర్చారు, అంతకుముందు కేసీఆర్ కూడా ఇలానే సర్దుబాటు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం భాజపా పోరాట వ్యూహం ఇలా ఉంది! మరి, ఈ పరిస్థితిని తెరాస సర్దుబాటు ధోరణితో ముందుకు సాగుతుందా… లేదంటే, ఢీ అంటే ఢీ అంటూ భాజపాతో లొల్లికి సిద్ధమౌతుందా అనేది ఆసక్తికరంగా మారుతోంది.