తెలంగాణలో భాజపా పురోగతి ఎలా ఉందంటే… మూడు అడుగులు ముందుకెళ్లి, రెండు అడుగులు వెనక్కి వస్తున్నట్టుగా ఉంది! తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని పార్టీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. భారీ ఎత్తున నేతల చేరికలు ఉంటాయని ఆ మధ్య అనేవారు. తెలంగాణపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారనీ, ఆయన రాష్ట్రానికి వస్తున్నారనీ, అసంతృప్త కాంగ్రెస్ నేతలకు పార్టీ గాలం వేస్తోందనీ… ఇలా చాలా వ్యూహాలు తెర మీదికి వచ్చినట్టే వచ్చి, కథనాలుగానే మిగిలిపోతున్నాయి. తాజాగా మరో పక్కా వ్యూహంతో టి. భాజపా నేతలు సిద్ధమౌతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ను కొన్నాళ్లు పక్కనపెట్టి, ప్రజల్లోకి వెళ్లాలని కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా కొన్ని కార్యక్రమాలను డిజైన్ చేసుకున్నారు టి. భాజపా నేతలు. వచ్చేవారం నుంచి వచ్చే నెలాఖరు వరకూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను లక్ష్మణ్ అధ్యక్షతన భాజపా నేతలు సిద్ధం చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటిలో అమలు కాని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లబొతున్నారు. బీసీలను ఆకర్షించే విధంగా వారి సమస్యలను ఫోకస్ చేస్తూ సంగ్రామ సభలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. రైతుల సమస్యలపై కూడా పోరుబాట అనే కార్యక్రమం నిర్వహిస్తారు. మహిళా సమస్యలను ఫోకస్ చేస్తూ మహిళా యువభేరి ఉంటుందని చెబుతున్నారు. ఇక, యువతను ప్రధానంగా ఆకర్షించేందుకు యువ గర్జనలు నిర్వహించాలనీ, వాటిలో ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై చర్చించాలని అనుకుంటున్నారు. దళితులపై అత్యాచారాలు, వారికి ఇస్తామన్న మూడు ఎకరాల భూమి అంశంపై కొన్ని కార్యక్రమాలు చేస్తారు. దీన్లో భాగంగా దళిత అదాలత్ లు నిర్వహిస్తారని సమాచారం. ఈ కార్యక్రమాలన్నీ అనుబంధ విభాగాల ద్వారా విజయవంతం చేయాలని రాష్ట్ర భాజపా నిర్ణయించింది.
ఇన్నాళ్లూ ఆపరేషన్ ఆకర్ష్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన భాజపా… ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం మంచి పరిణామమే. అయితే, ఈ కార్యక్రమాలన్నీ అనుకోవడానికి బాగానే ఉన్నాయి, ఆచరణలో ఏ స్థాయిలో విజయవంతం అవుతాయన్నదే చూడాలి. ఈ ప్రణాళికను సక్రమంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో భాజపా ఉనికిని మరింత బలోపేతం చేయొచ్చనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి, ఈ పని ఎప్పుడో చేయాల్సింది. నాయకుల ఆకర్షణ వ్యూహాలకంటే ప్రజలను ఆకర్షించే వ్యూహాలే పార్టీలకు మేలు చేస్తాయి. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా టి. భాజపా తెలుసుకుందని అనుకోవచ్చు. మొత్తానికి, కొన్నాళ్లపాటు ఆపరేషన్ ఆకర్ష్ ను పక్కన పెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు.