రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించిన నాటి నుండి ఆయన మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఆయన నియామకం పై విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరచడానికి రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అంటూ సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దూకుడు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం టిఆర్ఎస్ పార్టీ కంటే కూడా తెలంగాణ బిజెపికి తీరని నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
రేవంత్ రెడ్డి ఎదుగుదల బిజెపికి చేటు:
సాధారణంగా ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం అధికార పక్షానికి లాభం చేకూరుస్తూ ఉంటుంది. దుబ్బాక ను బిజెపి గెలవడం, ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలలో గణనీయంగా ఓట్లు పెంచుకోవడం ఆ పార్టీకి ఒక సారి గా హైప్ తీసుకొని వచ్చింది. దీంతో మేల్కొన్న కెసిఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని సిట్టింగ్ స్థానంలో ఓడించి, ఆ తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలలో ఆ పార్టీ ఊసే లేకుండా చేసి మళ్లీ సమీకరణాలను యధా స్థితికి తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బెంగాల్ ఎలక్షన్లలో మమతా బెనర్జీని టార్గెట్ చేసిన స్థాయిలో 2023 నాటికి కెసిఆర్ ని టార్గెట్ చేసే ఉద్దేశం లో ఉందన్న గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో పూర్తిగా మరుగున పడిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కొత్త జోష్ రావడం, మొన్నటి దాకా టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అని మాట్లాడిన వారే ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని మాట్లాడుతూ ఉండడం ఒకరకంగా బీజేపీకి పిడుగుపాటే. ఒకవేళ హుజురాబాద్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఓట్లు సాధిస్తే, బిజెపి కి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.
వ్యూహాత్మకంగా షర్మిల ను టార్గెట్ చేసిన రేవంత్:
షర్మిల పార్టీ పెట్టిన నాటి నుండి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తనకు మద్దతు ఇస్తోంది అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. తమ వైపు రానటువంటి క్రిస్టియన్ మరియు రెడ్డి సామాజికవర్గాల ఓట్లను షర్మిలకు మళ్లించడం ద్వారా కెసిఆర్ ఓట్లకు గండి కొట్ట వచ్చు అన్నది బీజేపీ ప్లాన్ అని ఆ పుకార్ల సారాంశం. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత షర్మిల ను టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ల బలోపేతం షర్మిల ఆశ లకు భారీగా గండి కొట్టే అవకాశం కనిపిస్తోంది.
ఒకప్పుడు తనను బ్యాన్ చేసిన కెసిఆర్ అనుకూల చానల్స్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫుల్ పబ్లిసిటీ:
రేవంత్ రెడ్డి పై ఒకప్పుడు కెసిఆర్ అనుకూల చానల్స్ తీవ్రస్థాయిలో విరుచుకు పడేవి. మై హోమ్ సంస్థ కట్టడాలలో రూల్స్ పాటించడం లేదంటూ రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేసిన సమయంలో ఆయనకు సంబంధించిన చానల్స్ లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి దగుల్బాజీ ,దగాకోరు, చోటామోటా నేత, బ్రోకర్ వంటి అత్యంత దారుణమైన పదాలతో రేవంత్ రెడ్డి మీద వరుస కథనాలు వచ్చాయి. ఆ తర్వాత, కొంత కాలం పాటు రేవంత్ రెడ్డి ని పూర్తిగా బ్యాన్ చేశాయి ఆ చానెల్స్. ఆ చానల్స్ మాత్రమే చూసి వారికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన విషయం కనీసం తెలియను కూడా లేదంటే ఆ చానల్స్ ఎంతగా ఆయనను నిషేధించాయో అర్థమవుతుంది.
అలాంటి చానల్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ని ఆకాశానికెత్తేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి కవరేజ్ ఇస్తున్నాయి. కెసిఆర్ అనుకూల చానల్స్ లో వచ్చిన ఈ మార్పు కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినందుకేనా లేక బిజెపి పార్టీ ని ఎదగనీయకుండా ఉండాలంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోవాలంటే కాంగ్రెస్ పార్టీ మరీ బలహీన పడకుండా ఎంతో కొంత బలం గా ఉంటేనే మేలన్న టిఆర్ఎస్ అభిప్రాయం మేరకే కెసిఆర్ అనుకూల చానల్స్ రేవంత్ రెడ్డికి ఈ కవరేజ్ ఇస్తున్నాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
మొత్తం మీద రేవంత్ రెడ్డి తాజా రాజకీయం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నప్పటికీ, అది టిఆర్ఎస్ కంటే ఎక్కువగా బిజెపి మరియు షర్మిల పార్టీలకు నష్టం కలిగిస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఏ మేరకు ఇది నిజం అవుతుంది అన్నది కాలమే సమాధానం చెప్పాలి.