తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో.. మరో అడుగు ముందుకేసింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం టీసీఎల్ కంపెనీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తిరుపతిలో ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమిపూజ నిర్వహిస్తున్నారు. టీసీఎల్ ప్రపంచంలోనే టాప్ త్రీ టీవీ ప్యానల్స్ తయారీ కంపెనీ. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌లోని 158 ఎకరాల్లో యూనిట్‌ని ఏర్పాటు చేసుతున్నారు. దాదాపుగా రూ.2200 కోట్లను పెట్టుబడిదగా పెడుతున్నారు. 8 వేల మందికి ఉద్యోగావకావకాశాలు లభిస్తాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ కంపెనీలో సంవత్సరానికి 60 లక్షల టీవీలు తయారు చేయనున్నారు.
టీసీఎల్ కంపెనీ.. ఏపీకి రావడంలో లోకేష్‌దే కీలక పాత్ర. భారత్‌లో ప్లాంట్ పెట్టాలని టీసీఎల్ అనుకున్నప్పుడు.. ఏపీ వారి ప్రాధాన్యత లిస్ట్‌లో లేదు. కానీ విషయం తెలిసిన తర్వాత లోకేష్ టీసీఎల్ ప్రతినిధుల్ని సంప్రదించి.. ఏపీలో అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సహకాలను వారికి వివరించారు. ఆ తర్వాత టీసీఎల్ ప్రతినిధులు ఏపీకి వచ్చారు. తిరుపతిని చూసుకున్నారు. ఆ తర్వాత వ్యవహారాలు చురుగ్గా సాగాయి. ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు చైనాకు వెళ్లినప్పుడు అక్కడే ఒప్పందాలు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలు పోటీ రాకండా… గుట్టుగా లోకేష్.. ఒప్పందాలు చేసుకుని వచ్చారు.
రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో ఒక్క మొబైల్ కూడా తయారయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఫాక్స్‌కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్ కంపెనీలు ఇప్పటికే వచ్చాయి. హోలీటెక్, ఫ్లెక్స్ ట్రానిక్స్, రిలయన్స్ జియో త్వరలో కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి. లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్ కూడా త్వరలోనే రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ డిజైన్ కంపెనీ ఇన్వెకాస్ రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టి 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఆటోమోబైల్, ఎలక్ట్రానిక్స్ రంగంలో.. భారీ పరిశ్రమలు రావడం.. వాటికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు రావడం ఖాయం కావడంతో.. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వలసలు ప్రారంభమవుతున్నాయి.