మునుగోడులో కాంగ్రెస్ ఓటర్ల కాళ్లు మొక్కాలని నిర్ణయించుకుంది. స్వయంగా రేవంత్ రెడ్డి ఓటర్ కాళ్లు మొక్కి ఓటు అడిగే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కరోనా నుంచి కోలుకున్న రేవంత్ రెడ్డి శనివారం నుంచే మునుగోడులో మకాం వేస్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ‘మన మునుగోడు, మన కాంగ్రెస్’ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా తనతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ఓట్లు అడగాలని నిర్దేశించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. ‘మన వెయ్యి మంది నాయకులు లక్ష మందికి పాదాభి వందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం’ అని పిలుపునిచ్చారు. తను కూడా స్వయంగా మునుగోడులోని తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వారికి వందనాలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యన్ని పరిరక్షించే యుద్ధంలో పాల్గొనబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు.
మునుగోడులో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీకి అధికారం, అర్థబలం ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కు రెండూ కొరతే. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాళ్లు మొక్కి ఓటర్లను కోరాలని నిర్ణయించుకుంది. రేవంత్ రెడ్డి స్వయంగా ఉపఎన్నిక బాధ్యతను తీసుకుని.. మునుగోడులో రంగంలోకి దిగుతూండటంతో అక్కడి పోరాటం ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.