హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల టిక్కెట్లపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్ట్ ఇవాళ ఇచ్చిన తీర్పుకు ఎవరికి వారు తమకు అనుకూలంగా అర్థాలు చెప్పుకుంటున్నారు. అసలు కోర్ట్ ఏమందో చూస్తే – ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. స్పీకర్ తుదినిర్ణయం తీసుకునేవరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను స్పీకర్ వీలైనంత త్వరగా పరిష్కారిస్తారని భావిస్తున్నట్లు పేర్కొంది.
టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఊరట లభించిందని అందరూ అంటున్నారు. అయితే, ఈ వ్యవహారంలో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు మాత్రం కోర్ట్ స్పీకర్‌కు కర్తవ్యాన్ని గుర్తు చేసిందని చెబుతున్నారు. తాము సుప్రీమ్ కోర్టుకు వెళతామని తెలిపారు.
మరోవైపు టీడీపీ టిక్కెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాసిన లేఖకూడా ఇవాళే కలకలం సృష్టించింది. రాష్ట్రపతి ప్రణబ్ ఈ లేఖను ఇవాళ కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ కార్యాలయానికి పంపారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.