ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు మాత్రమే దక్కుతున్నాయి. కూటమిలోని రెండు పార్టీలకు చెరో స్థానాన్ని కేటాయించారు. జనసేన తరపున నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున మూడు స్థానాలకు అభ్యర్థులను సామాజిక సమీకరణాల ప్రకారం ప్రకటించారు. కావలి గ్రీష్మ, బీదా రవిచంద్రతోపాటు బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. కావలి గ్రీష్మ..మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె. పార్టీలో ఎన్నికల సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఇక నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర కావలి నియోజకవర్గ సీటును త్యాగం చేశారు. ఆయనకు సీటు కేటాయించారు. యాదవ వర్గానికి చెందిన ఆయనకు చాలా కాలంగాఎలాంటి అవకాశం లభించలేదు. ఇక బీటీ నాయుడు కర్నూలు జిల్లాకు నేత. ఆయనకు కొనసాగింపు లభించింది. బీజేపీకి ప్రస్తుతం శాసనమండలిలో ప్రాతినిధ్యం లేదు. ఈ కోణంలో టీడీపీపై ఒత్తిడి తెచ్చి ఒక స్థానాన్ని కేటాయింప చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సోము వీర్రాజుకు చాన్సిచ్చారు. పీవీఎన్ మాధవ్ ఓ సారి ఎమ్మెల్సీగా చేశారు. అందుకే క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కోట వెంకట సత్యనారయణకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
టీడీపీలో చాలా మంది సీట్లు త్యాగం చేసిన సీనియర్ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పిఠాపురం వర్మ, దేవినేని ఉమ, వంగవీటి రాధావంటి వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రయత్నించినా సామాజిక, ప్రాంత సమీకరణాల ప్రకారం సాధ్యం కాదు. యనమలకు కూడా పొడిగింపు లభించలేదు.