సాధారణంగా అందరూ దీపావళి పండుగ రోజునే బాంబులు పేలుస్తుంటారు. కానీ తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాత్రం నెలకొకసారయినా రాజకీయ బాంబులు పేలుస్తుంటారు. రాజకీయ నాయకులు ఎవరయినా సాధారణంగా ప్రత్యర్ధి పార్టీల మీద అటువంటి బాంబులు పేలుస్తుంటారు. కానీ జేసి దివాకర్ రెడ్డి మాత్రం స్వంత పార్టీ మీదే పేల్చి ఇబ్బంది పెడుతుంటారు.
త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరితో సహా తెదేపా నేతలు అందరూ ప్రజలను మభ్యపుచ్చుతున్న సమయంలో , “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికి ప్రత్యేక హోదా రాదు. ఆసంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో తెలుసు. అందుకే ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఆర్ధిక ప్యాకేజి గురించి మాట్లాడుతున్నారు,” అని జేసి దివాకర్ రెడ్డి ఓ పెద్ద బాంబు పేల్చారు. అప్పుడు తెదేపా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొందో అందరికీ తెలుసు. ఆ తరువాత జేసి దివాకర్ రెడ్డి అటువంటి బాంబులు అనేకం పేల్చారు.
మళ్ళీ నిన్న అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో తెదేపా ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నపుడు బాంబులు పేల్చారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు ఎప్పటికీ మంత్రి పదవి ఇవ్వరు. నేను చస్తేగాని నాకు మంత్రి పదవి ఇవ్వారా? అని ఆయననే అడిగాను. మంత్రి పదవి అడగడానికి నాకెందుకు భయం? అయినా నాకు అదృష్టం లేకపోవడం వలననే నేను మంత్రి కాలేకపోయాను. చంద్రబాబు నాయుడుకి అదృష్టం ఉండబట్టే ముఖ్యమంత్రి కాగలిగారు,” అని అన్నారు.
“పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది?” అని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబుగా మరో బాంబు పేల్చారు. “అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికయినా పూర్తవుతుందని నేను అనుకోవడం లేదు. దాని గురించి నా చిన్నపటి నుంచి వింటూనే ఉన్నాను. ఇంకా వింటూనే ఉంటాను,” అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రతీ బహిరంగ సభలో పోలవరం ప్రాజెక్టుని నాలుగేళ్ళలో పూర్తి చేసి చూపిస్తామని మరిచిపోకుండా చెపుతుంటారు. అయితే ఆ నాలుగేళ్ళు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ తెలియదని జేసి దివాకర్ రెడ్డి మాటల వలన అనుమానించవలసి వస్తోంది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఆయన చెప్పిన మాటే చివరికి నిజమయింది కదా..అందుకు.