బలవంత మత మార్పిడులపై చంద్రబాబు ఏదో అన్నారంటూ.. వైసీపీ అనుకూల పాస్టర్లు కొంత మంది సోషల్ మీడియాలో చెలరేగిపోతూండటం కలకలం రేపుతోంది. చంద్రబాబుని పాస్టర్లు తిడుతున్న వీడియోలను వైరల్ చేయడానికి అధికార పార్టీ సోషల్ మీడియా టీంలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. టీడీపీకి సంబంధం లేదని క్రిస్టియన్ నేతలు.. టీడీపీకి రాజీనామా చేశారని హడావుడి చేశారు. ఆ తర్వాత టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు… టీడీపీపై పాస్టర్లు విరుచుకుపడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా.. చూడండి చంద్రబాబును పాస్టర్లు ఎలా తిడుతున్నారో …అంటూ ఆ వీడియోలను వైరల్ చేసేందుకు తన వంతు సాయం చేస్తోంది.
చంద్రబాబును తిడితే పూనకం వచ్చినట్లుగా ఊగిపోయే వైసీపీ కార్యకర్తలకు ఇది బాగానే ఉంది కానీ.. రాజకీయంగా తమ పార్టీకి చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీ పై స్థాయి నేతల్లో వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో వివాదాస్పదమయిన ఇద్దరు పాస్టర్లు ప్రవీణ్ చక్రవర్తి, అజయ్ కిషోర్ ఇద్దరూ బ్రదర్ అనిల్ సంస్థతో కలిసి వ్యవహారాలు చక్క బెడుతున్నవారే. ఇద్దరూ సోషల్ మీడియాలో తమ తమ పోస్టులను పెట్టిన వారే. వైసీపీ నేతలతో.. బ్రదర్ అనిల్‌తో తమ అనుబంధాన్ని బయట పెట్టుకున్నవారే. ఇద్దరిలో ఒకరు విగ్రహాలను బద్దలు కొట్టేశామని చెబితే.. ఇంకొకరు చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లుగా తిట్లు లంకించుకున్నారు. పాస్టర్ అజయ్ కిషోర్ వీడియోను వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు.
కానీ అది తమ పార్టీని క్రిస్టియన్లకే పరిమితం చేస్తుందన్న ఆలోచనకు రాలేకపోతున్నారు. అలాగే వైసీపీ నేతలు కొత్తగా కొన్ని క్రిస్టియన్ సంఘాలతో ధర్నాలకు పులికొల్పుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ.. వైసీపీకి ఆయా వర్గాల్లో మద్దతు పెరగడానికి అవుతాయి కానీ.. ఇతర వర్గాలు దూరమవుతాయి. ఈ విషయం అంచనా వేయకుండా.. క్రిస్టియన్ సంఘాలను టీడీపీ, బీజేపీపైకి ఎగదోయడానికి సిద్ధమవుతున్న వైనం.. ఇతర రాజకీయ పార్టీల నేతలను కూడా ఆశ్చర్య పరుస్తోంది.