రాజకీయాల్లో వున్నప్పుడు అందులోనూ అధికారం చేస్తున్నప్పుడు అన్ని అనుకూల పరిణామాలే వుండవు. వ్యతిరేకించేవారు కూడా సవాళ్లు విసురుతుంటారు. ఉద్యమాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చట్ట నిబంధనలను ఉపయోగించుకుని పోరాటం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని నివేదికలు తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి. వాటిని వాస్తవికంగా స్వీకరించి తీసుకోవలసిన గుణపాఠాలు తీసుకోవాలి గాని అంతా అనుకూలంగా చిత్రించుకుంటే లాభం వుండదు. కాని ఎపిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చాలా విషయాల్లో ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా చెప్పుకోవడానికి లేదంటే మరెవరినో నిందించి తగిలిన దెబ్బ కప్పిపుచ్చుకోవడానికి తంటాలు పడుతున్నది. కొద్ది వారాల కిందట ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణాలిచ్చేందుకోసం క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ఒక నివేదికను వెబ్సైట్లో పెట్టింది. విమర్శలు రావడంతో ఆ నివేదిక కనబడకుండా వెనక్కు పంపించారు. తర్వాత రాజధానిలో పర్యావరణ సమస్యలపై ఎన్జిటి తీర్పు వచ్చింది. నిర్మాణం కొనసాగించుకోవచ్చంటూనే ఎన్జిటి అనేక కఠినమైన షరతులు పెట్టింది. వాటి ప్రకారం చూస్తే ఇప్పుడుమొదలు పెట్టిన చాలా నిర్మాణాలు ప్రణాళికలు మార్చుకోవలసిందే. అయితే అప్పుడు కూడా మొదటి భాగమే చెప్పి రెండవ భాగానికి విలువ లేనట్టు చేశారు. తాజాగా పోలవరంపై కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ స్పందనను కూడా పాక్షికంగానే చెప్పి ప్రభుత్వ వాదన నెగ్గినట్టు చిత్రణ మొదలుపెట్టారు. ఈ విషయమై కొన్ని అంశాలు నిన్న చెప్పుకున్నాం. మరింత లోతుగా చెప్పుకోవలసిందేమంటే పునరావాస ప్యాకేజీతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా తగు వ్యవధినివ్వకుండా జారీ చేసిన టెండర్లు నిలుపు చేయాల్సిందేనని ఆదేశించారు. అయితే ఈ మార్పు వల్ల పనులు ఆలస్యం అవుతాయి గనకే గడ్కరీ అభ్యంతరం చెప్పినట్టు ఢిల్లీవెళ్లి చర్చలు జరిపిన రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ తిప్పి చెబుతున్నారు గాని వారి అభ్యంతరం వేరు. 2018 డిసెంబరు నాటికి ప్రాజెక్టుపూర్తి కావాలని గడ్కరీ అంటున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. ఎందుకంటే కేంద్రం నివేదికల్లో గడువు ప్రసక్తి లేనేలేదు. ఈ నెల 22న సమీక్ష కోసం వస్తానని, ముఖ్యమంత్రితో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పడాన్ని బట్టి చూస్తే తమ ఆధ్వర్యంలోనే జరగాలని వారు కోరుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. అంతా మాకే ఇచ్చేశారని పండుగ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కూడా ఇబ్బంది కరమే.