ఓ లక్ష్యం కోసం కార్యకర్తలు నెత్తురు చిందించారు. కేసులను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారు. సొంత ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం తమ అభిమాన నేతల నుంచి ఆ మాటలు వినేందుకు ఐదేళ్ళుగా కష్టపడుతూనే వచ్చారు. టార్గెట్ పెట్టుకొని పని చేశారు. ఆయన ఈసారి రాకపోతే ఏపీకి భవిత లేదని… ఆయన గెలవకపోతే దౌర్జన్యం దండిగా కొనసాగుతుందని ఓ కల కోసం శ్రమించారు.
నాటి కల సాకారమైతున్న వేళ ఏపీ ప్రజల హృదయాలు ఉద్వేగానికి లోనవుతున్నాయి. ఐదేళ్ల తర్వాత తమ అభిమాన నేత నుంచి ఓ మాట వినేందుకు తెలుగు తమ్ముళ్లు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తుండగా…తమ అభిమాన హీరో అండ్ లీడర్ నుంచి అదే తరహ వాక్యం వినాలని ఏళ్లుగా చూస్తున్న ఎదురుచూపులకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
అవును..ఇదంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల గురించే. ఏపీలో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఫుల్ స్టాప్ పడాలంటే చంద్రన్న, పవనన్నలు అధికారంలోకి రావాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు నెత్తురు చిందించారు. కేసులను చిరునవ్వులతో ఎదుర్కొన్నారు. వేధింపులు ఎదురైనా వెన్ను చూపకుండా చంద్రబాబు సీఎం అయితే చూడాలంటూ అవిశ్రాంతంగా పోరాడారు. ఇప్పుడు వారి కల సాకారం అవుతోంది.
అయితే , తమ అభిమాన నేతల నోటి నుంచి రావాలని కార్యకర్తలు కోరుకున్న బలమైన ఆ వాక్యం ఏంటనేగా మీ సందేహం.. చంద్రబాబు అను నేను.. పవన్ కళ్యాణ్ అను నేను.. ఈ మాటలు వినేందుకు అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు జనసేన కార్యకర్తలు ఏళ్లుగా ఎదురుచూస్తుండగా ఆ సమయం రానే వచ్చింది. బుధవారం ఉదయం 11గంటల 27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ అపురూప వేడుకను తిలకించాలని తెలుగు తమ్ముళ్లు వేలాదిగా కేసరపల్లి వైపు కదం తొక్కుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం దాదాపు ఖాయం కావడంతో ఆయన ప్రమాణస్వీకారాన్ని చూసేందుకు జనసేన కార్యకర్తలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు తమ కల సాకారం అవుతుందని..అది ఓ ప్రత్యేక సందర్భంలో జరుగుతుండటం మరింత ఆనందంగా ఉందని చెప్తున్నారు.