ఎట్టకేలకు చంద్రబాబు పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చంద్రబాబు ఆయన నివాసంలో కలిశారు, దాదాపు గంట సేపు చర్చలు జరిపారు, ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు, దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ కలయిక అనివార్యమైందని, భవిష్యత్ తరాలను కాపాడడానికి ఈ కలయిక చారిత్రక అవసరం అని చెప్పుకొచ్చారు.
టిడిపి అభిమానుల స్పందన
అయితే ఈ పొత్తుపై మాత్రం ప్రజలలో మిశ్రమ స్పందన వస్తోంది. టిడిపి అభిమానులో మాత్రం, మోడీ మరీ దూకుడుగా వెళుతున్నారు కాబట్టి, మోడీని నిలువరించాలంటే జాతీయ స్థాయిలో ఇలాంటి పెద్ద కూటమి లో ఉండడం అనివార్యం కాబట్టి చంద్రబాబు నిర్ణయం సమంజసమే అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. నిజానికి తెలుగుదేశం అభిమానులకు కూడా ఈ కలయిక ఆశ్చర్యాన్ని కలిగించింది. మోడీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఏదైనా థర్డ్ ఫ్రంట్ పంచన చేరి పరోక్షంగా కాంగ్రెస్ కి చంద్రబాబు మద్దతు ఇస్తాడు అనుకున్నారు కానీ ఇలా నేరుగా రాహుల్ గాంధీ తో చర్చలు జరుపుతారని, నేరుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారని తెలుగుదేశం అభిమానులు సైతం ముందు ఊహించలేదు.
తెలుగుదేశం అభిమానులు లో కూడా, వంద శాతం మందికి ఈ కలయిక నచ్చిందా అంటే అది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, తెలుగుదేశం అభిమానుల లో చాలామంది కాంగ్రెస్ వ్యతిరేకతను నరనరాలలో నింపుకొని ఉన్నారు. ప్రత్యేకించి గత తరం నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న వారు, మేము ఓటు వేయకుండా అయినా ఉంటాము తప్ప కాంగ్రెస్కు మాత్రం మేము ఓటు వేయం అని అంటున్నారు.
విపక్ష నాయకుల , ఆ పార్టీల అభిమానుల స్పందన
ఇదిలా ఉంటే, విపక్షాలు మాత్రం అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పైన అని, ఇప్పుడు చంద్రబాబు దానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇతర పార్టీల అభిమానులు చంద్రబాబును కేంద్రంగా చేసుకొని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు గతంలో ఎన్నిసార్లు మాట మార్చింది, రాహుల్ గాంధీని గతంలో చంద్రబాబు ఎలా తిట్టింది, విభజన సమయంలో కాంగ్రెస్ నిర్ణయం ఏమేమి తిట్టింది, ఇవన్నీ మీమ్స్ క్రియేట్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు అవకాశవాదానికి మరొక నిదర్శనం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి ఈ కలయిక అని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా సెటైర్లు వేస్తూ, “అవును, (తెలుగు)దేశాన్ని రక్షించుకోవడానికి ఈ కలయిక” అంటూ విమర్శలు చేస్తున్నారు.
సాధారణ ప్రజల స్పందన
ఇక సాధారణ ప్రజలలో కూడా, ప్రస్తుతానికి అయితే ఈ పొత్తుపై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ చేసింది అన్యాయమే అయినప్పటికీ, అసలు రాష్ట్రాన్ని అర్థం పర్థం లేకుండా విభజించింది కాంగ్రెస్ పార్టీయే. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కూడా చంద్రబాబే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అశాస్త్రీయంగా విభజించి, కనీసం రాజధాని లేకుండా గెంటేశారని గతంలో చంద్రబాబు పలుమార్లు చెప్పి ఉన్నారు. అది కాక, తెలంగాణ నిర్ణయం జరిగిపోయాక, సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే, దాదాపు రాష్ట్రం మొత్తం రోడ్ల మీదికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియాగాంధీ గాని, రాహుల్ గాంధీ కానీ , మరే ఇతర జాతీయ నాయకుడు కానీ, సీమాంధ్ర వైపు కనీసం తొంగి చూడలేదు. ప్రజల్లో ఆ గాయం ఇప్పటికీ పూర్తిగా మానలేదు. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ కలయిక, చంద్రబాబు కి సంబంధించిన రాజకీయ అవసరం గా ప్రజలకు కనిపిస్తోంది తప్ప, నిజంగా దేశాన్ని రక్షించడం కోసమే వీరిద్దరూ కలిశారని తెలుగుదేశం పార్టీ అనుంగు మీడియా ఎంత భజన చేసినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు.
ఏది ఏమైనా ప్రస్తుతానికి, చంద్రబాబు కాంగ్రెస్ తో కలయిక తెలుగుదేశం పార్టీ అభిమానులలో , అది కూడా ఎక్కువగా ప్రస్తుత తరం అభిమానులలో, హర్షాన్ని కలిగిస్తే, ఇతర పార్టీల అభిమానులతో పాటు సాధారణ ప్రజలలో కూడా ఈ కలయిక కాస్త విస్మయాన్ని, కాస్త వ్యతిరేకతని కలిగించింది.
– జురాన్ ( @ CriticZuran)