ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న అధికారిలందరూ… ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని గుర్తు చేసుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరికల్లాంటి సూచనలు పంపుతున్నారు. జగన్ ప్రభుత్వంలో క్విడ్ ప్రో కో వ్యవహారాలు ప్రారంభమయ్యాయని… తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సమయంలో.. టీడీపీ నేతలు..కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ దాదాపుగా రూ. ఏడు వందల కోట్లు తక్కువకు పనులు చేసేందుకు అంగీకరించడం.. అదే సమయంలో.. మేఘా గ్రూప్‌కే చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ ను… అత్యధిక ధరలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంటూండటంతో.. టీడీపీ నేతలు దూకుడు పెంచారు.
ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును అనూహ్యంగా బదిలీ చేయడం.. ఆ వెంటనే.. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఈ టెండర్లు పిలవడం… అన్నీ క్విడ్ ప్రో కోలో భాగంగానే జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటినీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డీల్ చేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల విషయంలోనూ… అదే తరహా క్విడ్ ప్రో కో విధానం అవలంభిస్తున్నారని.. తక్కువకు రీ టెండర్లు వేసిన వారికే.. బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఎవరికి బిల్లులు చెల్లించారో బయటపెట్టాలని ..దేవినేని ఉమ సవాల్ చేస్తున్నారు. పోలవరం రివర్స్ టెండర్లో.. అసలు నిబంధనలు ఏంటి..? ఎవరెవరు ఎంతెంతకు కోట్ చేశారు..? ఎలా అనుమతులు ఇచ్చారో ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.
వైసీపీ సర్కార్ జాతికి రాజద్రోహం చేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల తీరు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారం .. సలహాదారులే.. మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యవహారంతో.. అధికార వర్గాల్లోనూ.. ఓ రకమైన అసహనం పెరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే … నిర్ణయాల్లో భాగం అయితే.. జైలుకెళ్లాల్సి వస్తుందన్నట్లుగా..టీడీపీ నేతలు.. హెచ్చరికలు చేయడం… కలకలం రేపే వ్యవహారమే.